Begin typing your search above and press return to search.

ఏడేళ్ల తర్వాత 'నా పేరు శివ 2' గా వస్తున్న కార్తీ సినిమా..!

By:  Tupaki Desk   |   5 Jan 2022 1:53 PM GMT
ఏడేళ్ల తర్వాత నా పేరు శివ 2 గా వస్తున్న కార్తీ సినిమా..!
X
డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోనూ మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు. ఆయన నటించిన 'యుగానికొక్కడు' 'ఆవారా' 'నా పేరు శివ' 'ఖాకీ' 'ఖైదీ' 'సుల్తాన్' వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.

'ఊపిరి' అనే ద్విభాషా చిత్రంతో నాగార్జునతో కలిసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే కార్తీ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏడేళ్ల క్రితం నాటి సినిమాని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కార్తి - క్యాథరీన్ థెరిసా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ''మద్రాస్''. ఇందులో కలైయరాసన్ కీలక పాత్ర పోషించారు. 'కబాలి' 'కాలా' 'సార్పట్ట పరంబరై' వంటి సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె ఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2014లో విడుదలైన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని ''నా పేరు శివ 2'' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

కార్తీ హీరోగా స్టూడియో గ్రీన్ పతాకంపై రూపొందిన 'నాన్ మహాన్ అల్ల' సినిమా 'నా పేరు శివ' గా తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంటుతో ఇప్పుడు 'మద్రాస్' సినిమాని ''నా పేరు శివ 2'' గా తీసుకొస్తున్నారు.

సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మురళి జి సినిమాటోగ్రఫీ అందించారు. జనవరి నెలలోనే ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.