Begin typing your search above and press return to search.

‘ఖాకి’ సినిమా వెనుక ట్రూ స్టోరీ ఏంటంటే..

By:  Tupaki Desk   |   7 Nov 2017 6:15 AM GMT
‘ఖాకి’ సినిమా వెనుక ట్రూ స్టోరీ ఏంటంటే..
X
పోలీస్ కథలతో తెరకెక్కే సినిమాలు చాలా వరకు ఫిక్షన్లే అయి ఉంటాయి. వాస్తవ ఘటనలతో తెరకెక్కే పోలీస్ స్టోరీలు అరుదు. తమిళ కథానాయకుడు కార్తి హీరోగా తెరకెక్కిన ‘ఖాకి’ ఈ కోవలోని సినిమానే. తమిళ.. తెలుగు భాషల్లో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు పోస్టర్ మీదే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ ట్రూ స్టోరీ ఏంటి అన్నది కార్తి ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

కార్తి గతంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’లో నటించాడు. ఆ సినిమాలో పోలీస్ పాత్ర కోసమని ఓ పోలీస్ అధికారిని కలిశాడట కార్తి. ఆయన డీల్ చేసిన ప్రత్యేకమైన కేసుల గురించి చెప్పమంటే.. సీరియల్ హత్యలకు సంబంధించిన కేసును పదేళ్ల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎలా ఛేదించిందీ వివరించాడట. ఒక్క క్లూ కూడా దొరకని ఆ కేసును తన టీంతో కలిసి ఆయన ఛేదించిన తీరు ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.

ఐతే ఇంతకంటే ఆశ్చర్యకరంగా కొన్నేళ్ల తర్వాత దర్శకుడు వినోద్ ఈ కేసు నేపథ్యంలో కథ రాసుకుని తనను కలిశాడని చెప్పాడు కార్తి. ఈ కథకు వెంటనే తాను ఓకే చెప్పి సినిమా చేశానని.. అదే ‘ఖాకి’ అని అతను తెలిపాడు. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిన ‘ఖాకి’ని తెలుగులో ఆదిత్య మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్నందించాడు.