Begin typing your search above and press return to search.

సూపర్ థ్రిల్లర్‌ కి సీక్వెల్ వస్తుందట

By:  Tupaki Desk   |   10 July 2018 5:09 PM GMT
సూపర్ థ్రిల్లర్‌ కి సీక్వెల్ వస్తుందట
X
గత ఏడాది విడుదలైన కార్తి సినిమా ‘ఖాకి’ అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి విజయం సాధించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా యువ దర్శకుడు వినోద్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు భలే థ్రిల్ ఇచ్చింది. ఈ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు ఎంత పరిశోధన జరిపాడో సినిమాలో కనిపించింది. సినిమా తీయడంలోనూ కష్టమంతా తెరపై దర్శనమిచ్చింది. ఇదొక అరుదైన సినిమా అనే చెప్పాలి. థియేట్రికల్ రన్ తర్వాత అమేజాన్‌ లో రిలీజ్ చేస్తే అక్కడా ఆదరణ పొందిందీ చిత్రం. కార్తి కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ రాబోతోందట. దర్శకుడు వినోద్ ఆ ఆలోచనతోనే ఉన్నట్లు కార్తి వెల్లడించాడు.

తనకు వినోద్ ఇప్పటికే ఒక లైన్ కేూడా చెప్పాడని.. పూర్తి కథ ఎప్పుడు రెడీ చేసి సినిమా చేద్దామంటాడో అప్పుడు తాను నటించడానికి సిద్ధమని ప్రకటించాడు కార్తి. ‘ఖాకి’లో మాదిరే తమిళనాట పోలీసులకు సవాలుగా మారిన మరో దోపిడీ దొంగల కేసు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ప్రస్తుతం కార్తి ‘చినబాబు’ సినిమాతో రెడీ అయ్యాడు. ఈ చిత్రం ఈ శుక్రవారమే తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాండి రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి సరసన ‘అఖిల్’ భామ సాయేషా నటించింది. సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. కార్తి ఇందులో రైతుగా నటించాడు. దీని తర్వాత కార్తి ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు.