Begin typing your search above and press return to search.

కార్తి మాత్రం చంపేశాడబ్బా

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:29 PM GMT
కార్తి మాత్రం చంపేశాడబ్బా
X
కొన్నాళ్లుగా అటు తమిళంలో.. ఇటు తెలుగులో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కాష్మోరా’ శుక్రవారమేు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఐతే సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రేక్షకులు ఏదో ఆశిస్తే.. దర్శకుడు గోకుల్ ఇంకేదో చూపించాడు. తీసిపారేయదగ్గ సినిమా కాదు కానీ.. మగధీర.. అరుంధతి.. బాహుబలి రేంజిలో ఊహించుకుంటే దానికి తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఐతే ఈ సినిమాలో కొన్ని ఆకర్షణలు మాత్రం ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్తి పెర్ఫామెన్స్ గురించే.

కార్తి ఎంత మంచి నటుడో తొలి సినిమా ‘పరుత్తి వీరన్’లోనూ చూశారు ప్రేక్షకులు. ఆ తర్వాత కూడా మరిన్ని మంచి పాత్రలతో ఆకట్టుకున్నాడు. ‘ఊపిరి’ సినిమాలోనూ అద్భుతమైన నటన కనబరిచాడు. ‘కాష్మోరా’ కార్తికి పెర్ఫామెన్స్ పరంగా కెరీర్లో మరో గుర్తుంచుకోదగ్గ అనడంలో సందేహం లేదు. ఇటు కాష్మోరా.. అటు రాజ్ నాయక్ గా రెండు పాత్రల్లోనూ మెప్పించాడు కార్తి. హీరోగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల్లో కార్తిలా మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లు తక్కువమంది కనిపిస్తారు. ‘కాష్మోరా’లో కార్తి పాత్ర పంచిన వినోదంతో ప్రేక్షకులు బాగా కనెక్టవుతున్నారు. ముఖ్యంగా దయ్యం దగ్గర చిక్కుకుని తన బురిడీ బాబా వేషాలు చూపించే సీన్లో కార్తి అదరగొట్టాడు. ఫ్లాష్ బ్యాక్ లో రాజ్ నాయక్ పాత్రలోనూ అతను అదరగొట్టాడు. ఆ పాత్ర కోసం లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాడు. తన నటనతోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా కార్తి అభిమానులనైతే మాత్రం ‘కాష్మోరా’ మిస్ కాకూడదనే చెప్పాలి.