Begin typing your search above and press return to search.

లాస్ట్ 40 మినిట్స్ ఒక రేంజ్ లో ఉంటుంది: హీరో కార్తి

By:  Tupaki Desk   |   1 April 2021 3:52 AM GMT
లాస్ట్ 40 మినిట్స్ ఒక రేంజ్ లో ఉంటుంది: హీరో కార్తి
X
మొదటి నుంచి కూడా కార్తి విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. విలక్షణమైన కథానాయకుడిగా విజయాలను అందుకుంటున్నాడు. కార్తి ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే, ఆ కథలో విషయం ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఉత్సాహంతో ఎదురుచూసేలా చేశాడు. అలా ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సుల్తాన్' ముస్తాబైంది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ .. " తమిళనాడులో ఎలక్షన్స్ కావడం వలన ఏప్రిల్ 2వ తేదీన రాబోతున్నాము. మా పరిస్థితిని అర్థం చేసుకుంటూ .. తెలుగులో మా సినిమా కూడా బాగా ఆడాలని విష్ చేసిన మా అన్నయ్య నాగార్జున గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. మా అన్నయ్య 'వైల్డ్ డాగ్' సినిమా కూడా అదే రోజున వస్తోంది. ఒక తమ్ముడిగా ఆ సినిమా పెద్ద హిట్ కావాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మొదటి నుంచి నాగార్జున డిఫరెంట్ కాన్సెప్టులు చేస్తూ వస్తున్నారు .. నిజంగా అది చాలా గట్స్ తో కూడుకున్న పని. నాకు నాగార్జున గారే స్ఫూర్తి .. ఆయనతో పరిచయం దొరుకుతుందనే నేను 'ఊపిరి' చేశాను.

'సుల్తాన్' సినిమా పని 2017 మే నెలలో మొదలైంది. ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించవలసి వచ్చింది .. అందులో ఒక ఏడాది కోవిడ్ తీసుకెళ్లిపోయింది. అలాంటి కోవిడ్ వలన పడిన టెన్షన్ అంతా కూడా ఈ సినిమా చూస్తే పోతుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చివరి 40 నిమిషాల సేపు సాగే ఎమోషన్ నాకు బాగా నచ్చింది. 'మహాభారతం'లో కృష్ణుడు .. పాండవులవైపు కాకుండా కౌరవుల వైపు ఉంటే ఎలా ఉంటుందనే ఇమాజినేషన్ తో ఈ కథ రాశారు. రష్మిక తన పాత్రను చాలా బాగా చేసింది. ఈ ఫంక్షన్ కోసం ముంబై నుంచి ఇక్కడికి వచ్చింది. ఫస్టు టైమ్ ఒక పల్లెటూరి అమ్మాయిగా ఆమెను మీరు చూడబోతున్నారు. ఏప్రిల్ 2న మా నాగార్జున అన్నయ్య సినిమా చూసిన తరువాత నా సినిమా చూడండి" అంటూ, 'మహర్షి' సినిమాకిగాను నేషనల్ అవార్డును గెలుచుకున్న వంశీ పైడిపల్లికి అభినందనలు అందజేశాడు.