Begin typing your search above and press return to search.

ఈ సారి ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ గట్టిగానే ఉందే!

By:  Tupaki Desk   |   3 Jun 2022 2:30 AM GMT
ఈ సారి ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ గట్టిగానే ఉందే!
X
కోవిడ్ కారణంగా కొంతకాలంగా ఏ సినిమా కూడా పండగ సందర్భాలలో ప్రేక్షకులను పలకరించలేకపోయింది. ఆ సమయంలో అసలు థియేటర్లు తెరుస్తారా? అనేది ఒక సందేహమైతే, తెరిచినా జనాలు వస్తారా? అనేది మరో సందేహం. తమ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా, ఆ రోజున ఆ సినిమాను థియేటర్లకు తీసుకుని వెళ్లగలమా? అనేది మరో డౌట్. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు టాలీవుడ్ హీరోలు తమ సినిమాలు 'సంక్రాంతి'కి విడుదలయ్యేలా చూసుకునేవారు. ఆ సమయంలో పెద్ద సినిమాల మధ్య .. స్టార్ హీరోల మధ్య గట్టిపోటీ ఉండేది.

ఒకవేళ సంక్రాంతికి తమ సినిమాలు బరిలోకి దింపలేకపోతే 'దసరా'ను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లేవారు. దసరాకి కూడా దాదాపు బరిలో పెద్ద హీరోలే ఉంటారు. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే, అక్కడి స్టార్ హీరోలంతా 'దీపావళి'కి రంగంలోకి దిగుతారు. వాళ్లకి దీపావళి సెంటిమెంట్ ఎక్కువ .. ఆ సమయంలో అక్కడ సినిమాలు జోరుగా ఆడేస్తాయి. అందువలన స్టార్ హీరోల సినిమాలు ఒక రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. అయితే ఈ సారి మాత్రం అక్కడ 'వినాయకచవితి'కే గట్టిపోటీ కనిపిస్తోంది.

కార్తి హీరోగా 'విరుమన్' సినిమా రూపొందుతోంది. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. శరణ్య .. సూరి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వినాయకచవితి కానుకగా ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక శివకార్తికేయన్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఎల్ ఎల్ పి - సురేశ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అటు కార్తి .. ఇటు శివకార్తికేయన్ .. ఈ పోటీలో ఎవరెన్ని మార్కులు కొట్టేస్తారనేది చూడాలి.