Begin typing your search above and press return to search.

ఆరో వారంలోనూ హౌస్ ఫుల్స్.. ఇది కదా ఘన విజయం అంటే..!

By:  Tupaki Desk   |   21 Sep 2022 6:06 AM GMT
ఆరో వారంలోనూ హౌస్ ఫుల్స్.. ఇది కదా ఘన విజయం అంటే..!
X
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "కార్తికేయ 2". చందూ మొండేటి ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ కి దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

శ్రీ కృష్ణ తత్వం మరియు ద్వారకా నగర ప్రాముఖ్యత.. చరిత్ర - పురాణాల అంశాల నేపథ్యంలో 'కార్తికేయ 2' చిత్రాన్ని తెరకెక్కించారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం.. అద్భుతమైన విజువల్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు.

అందుకే ఒక సాదారణ సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేకమంది సినీ ప్రముఖులు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.

ఉత్తరాదిలోనే నిఖిల్ సినిమాకు అనూహ్య స్పందన లభించింది. అక్కడ హిందీ వెర్షన్ రూ. 30 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. 'కార్తికేయ 2' విడుదలై 5 వారాలు దాటినా.. ఇప్పటికీ జనాలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆరో వారంలోనూ కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటేనే.. ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవంతంగా 39 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలో అర్థ శతదినోత్సవం జరుపుకోబోతోంది.

ఇకపోతే తెలుగు హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన 'కార్తికేయ 2'.. ఇప్పుడు మాలీవుడ్ లోకి వెళ్తోంది. మలయాళ వెర్షన్ ను సెప్టెంబర్ 23వ తేదీన గ్రాండ్‌ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కలిసి కేరళ రాష్ట్రంలో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి మలయాళంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

2014లో నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ గా "కార్తికేయ 2" తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - శ్రీనివాస రెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష - తులసి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.