Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కార్తికేయ 2

By:  Tupaki Desk   |   13 Aug 2022 7:09 AM GMT
మూవీ రివ్యూ : కార్తికేయ 2
X
చిత్రం : కార్తికేయ 2

'కార్తికేయ-2' మూవీ రివ్యూ
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ-అనుపమ పరమేశ్వరన్-ఆదిత్య మేనన్-శ్రీనివాసరెడ్డి-వైవా హర్ష-సత్య-ప్రవీణ్-తులసి తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం:
మాటలు-కథా విస్తరణ: మణిబాబు కరణం
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్-టి.జి.విశ్వప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందూ మొండేటి

ఎనిమిదేళ్ల కిందట యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ.. కొత్త దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన 'కార్తికేయ' ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే సంకేతాలు ఇచ్చిన ఈ జోడీ.. ఎట్టకేలకు 'కార్తికేయ-2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీక్వెల్ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

కార్తికేయ (నిఖిల్ సిద్దార్థ) ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రతి విషయాన్నీ శాస్త్రీయ దృక్పథంతో చూసే అతను.. మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. ఐతే తన తల్లి కోరిక మేరకు ఒక మొక్కు తీర్చుకోవడానికి ఆమెతో కలిసి ద్వారకకు వెళ్తాడు. అక్కడ అతడికి కొన్ని అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఒక ఆర్కియాలజిస్ట్ తనకో బాధ్యతను అప్పగించి ప్రాణాలు కోల్పోతాడు. అతణ్ని హత్య చేసిన నేరం కార్తికేయ మీద మోపి పోలీసులు అతడి వెంట పడతారు. వారి నుంచి తప్పించుకుని ఒక లక్ష్యం కోసం కార్తికేయ తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ లక్ష్యం ఏంటి.. దాన్ని అతను చేరుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తెలుగులో ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అనగానే దర్శకులు ఒత్తిడిలో పడిపోతుంటారు. తొలి ప్రయత్నంలో అద్భుతాలను ఆవిష్కరించే డైరెక్టర్లు.. ఆ చిత్రానికి కొనసాగింపుగా సినిమా తీస్తున్నపుడు తమ పనితనాన్ని చూపించలేకపోతుంటారు. తొలి చిత్రానికి మించి ఏదో చేయాలనే తపనలో మూలాల్ని మరిచిపోయి పక్కదోవ పట్టేస్తుంటారు. ఎనిమిదేళ్ల కిందట 'కార్తికేయ'తో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చందూ మొండేటి మాత్రం ఈ జాబితాలో చేరలేదు. సీక్వెల్ కోసం మళ్లీ ఇంకో ఆసక్తికర కథను తీర్చిదిద్దుకున్నాడు. ఈసారి అతడి కాన్వాస్ పెద్దదైంది. కథలోకి భారీతనం వచ్చింది. ఈ క్రమంలో ఇంకేదో చేయాలన్న తపనలో చందూ అక్కడక్కడా కొంచెం గాడి తప్పిన మాట వాస్తవమే. కానీ అతను ప్రేక్షకులను నిరాశకైతే గురి చేయలేదు. 'కార్తికేయ' స్థాయిలో ఇది ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేయక పోయినా.. ఆద్యంతం ఎంగేజ్ చేస్తూ కొంచెం భిన్నమైన.. సంతృప్తికర సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం కలిగిస్తుంది 'కార్తికేయ-2'.

హీరో ఏమో కళ్లతో చూసేది తప్ప ఏదీ నమ్మని ఒక యంగ్ డాక్టర్.. కథేమో దేవుడు-గుడి చుట్టూ తిరుగుతుంది. 'కార్తికేయ' యునీక్ గా అనిపించి ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించడానికి ఈ కాన్ఫ్లిక్టే ప్రధాన కారణం. ఈ కాన్సెప్ట్ చుట్టూ ఉత్కంఠభరితంగా కథను మంచి థ్రిల్స్ ఇచ్చాడు చందూ మొండేటి. 'కార్తికేయ-2'లోనూ ఈ కాన్ఫ్లిక్ట్ అయితే సేమ్. హీరో పాత్రను అలాగే ఉంచి.. 'కార్తికేయ' థీమ్ ను కొనసాగిస్తూ ఒక కొత్త కథను చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్రహ్మణ్యపురం నుంచి కథను ద్వారకకు తీసుకెళ్లాడు. 'కార్తికేయ'లో ఒక ఊరిలో జరిగే వింత ఘటనల తాలూకు మిస్టరీని ఛేదించే హీరో.. ఈసారి ఒక లక్ష్యంతో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అనుభవాల సమాహారమే సినిమా. 'కార్తికేయ' కథలో ఉన్న మిస్టరీ వల్ల.. దాన్ని ఛేదించే క్రమంలో వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. సస్పెన్స్ ఫ్యాక్టర్ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. 'కార్తికేయ-2'లో ఆ తరహా థ్రిల్స్ మిస్సవడం మైనస్. అలా అని ఇది బోరింగ్ గా అయితే అనిపించదు. ఎప్పటికప్పుడు కథ కొత్త మలుపులు తిరుగుతూ.. కొత్త కొత్త పాత్రలు రంగంలోకి దిగుతూ.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.

కార్తికేయ-2 ఆరంభంలో కొంచెం నెమ్మదిగానే అనిపిస్తుంది. 'కార్తికేయ'లో ఎంబీబీఎస్ చదువుతూ కనిపించే హీరో.. వర్తమానంలో చదువు పూర్తి చేసి హాస్పిటల్లో వైద్యుడిగా పని చేస్తుంటాడు. ఈలోపు తన శాస్త్రీయ దృక్పథంతో అతను ఛేదించిన ప్రశ్నలు.. సాధించిన ఘనతలు.. ప్రస్తుత అతడి నేపథ్యం చూపిస్తూ కొంత సమయం నడిపించిన దర్శకుడు.. అతడి మొక్కు పేరుతో కథను ద్వారకకు తీసుకెళ్తాడు. అక్కడ కథ ముదిరి పాకాన పడడానికి కొంత సమయం పడుతుంది. అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక రహస్య ప్రాంతంలో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కడియాన్ని చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా కథానాయకుడు ఈ ఛట్రంలోకి వచ్చి ఆ కడియాన్ని సాధించి లోక కళ్యాణానికి ఉపయోగించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ నడుస్తుంది. కడియం తాలూకు పూర్వ కథను అంత ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు చందూ మొండేటి. దాన్నో అద్భుతం లాగా చూపిస్తే.. అందరూ దాని కోసం వెంపర్లాడడం లాజికల్ గా కనిపిస్తుంది. కానీ ఈ సన్నివేశాలను గ్రాఫిక్స్ రూపంలో మొక్కుబడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది.

ప్రథమార్ధంలో కొంచెం ఒడుదొడుకులతో సాగే 'కార్తికేయ-2' ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ద్వితీయార్ధంలో చాలా వరకు కథ ఆసక్తికరంగానే సాగుతుంది. కడియానికి సంబంధించి క్లూస్ ఒక్కోటి కనిపెడుతూ.. చివరగా దాన్ని సాధించే వరకు సాగే ప్రయాణంలో వచ్చే ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. అనుపమ్ ఖేర్ పాత్ర కనిపించేది కాసేపే అయినా.. ఆయన సినిమాకు చేకూర్చాల్సిన ప్రయోజనం చేకూర్చాడు. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు అంతకుమించి అంటూ ఆయన గొప్పదనాన్ని అనుపమ్ పాత్రతో చెప్పించిన విధానం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లను దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు. ఒక పెద్ద హీరో సినిమాలో మాదిరి చూపించిన భారీ లొకేషన్లు.. సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ముందే అన్నట్లు 'కార్తికేయ'లో మాదిరి ఇందులో సస్పెన్స్ ఎలిమెంట్స్ లేకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే. కానీ కథలోని భారీతనం.. పురాణాలతో ముడిపెట్టిన విధానం.. కొన్ని మలుపులు.. హీరో పాత్ర ప్రేక్షకులను సంతృప్తి పరుస్తాయి. ఒకసారి చూడటానికి ఢోకా లేని థ్రిల్లర్ ఇది.

నటీనటులు:

'కార్తికేయ' సూపర్ సక్సెస్ తర్వాత ఆ పాత్రను మరోసారి చేస్తుండటంతో నిఖిల్‌ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అది పాత్రలో ప్రతిఫలించింది. ఆద్యంతం మంచి ఎనర్జీతో నిఖిల్ ఆకట్టుకున్నాడు. అతడి కష్టం తెరమీద కనిపిస్తుంది. స్వాతి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే చేసింది. ఐతే ఆమె హీరోయిన్ లాగా కాకుండా సినిమాలో ఒక పాత్రధారిలానే కనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో రాణించాడు. సీరియస్ గా సాగే సినిమాలో వైవా హర్షతో కలిసి అతను ప్రేక్షకులకు అక్కడక్కడా నవ్వించాడు. విలన్ పాత్ర చేసిన ఆదిత్య మేనన్ జస్ట్ ఓకే అనిపించాడు. ఆయన పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. హీరో తల్లి పాత్రలో తులసి తనకు అలవాటైన రీతిలో నటించింది. ప్రవీణ్.. సత్యలకు పెద్దగా స్క్రీన్ టైం దొరకలేదు. అభీరుడి పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం: కాలభైరవ సంగీతం అనుకున్నంత స్థాయిలో లేదు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నవే ఒకట్రెండు పాటలు. అవి కూడా బ్యాగ్రౌండ్ సాంగ్స్ లాగా నడిచిపోతాయి. అవి సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం విషయంలో కాలభైరవ డిఫరెంట్ గా ఏదో చేద్దామని చూశాడు కానీ.. అది అనుకున్నంతగా సన్నివేశాలను ఎలివేట్ చేయలేకపోయింది. థ్రిల్లింగ్ సీన్లలో ఆర్ఆర్ పరంగా ఉండాల్సిన ఎగ్జైట్మెంట్.. హడావుడి కనిపించలేదు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. భారీ లొకేషన్లలో చిత్రీకరించిన సినిమాలో విజువల్స్ టాప్ నాచ్ అనిపిస్తాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. మణిబాబు కరణం మాటలు బాగున్నాయి. ''మనిషి తన మేధస్సులు ఒక శాతం వినియోగిస్తే సంపాదన.. పది శాతం వినియోగిస్తే సేవ.. వంద శాతం ఉపయోగిస్తే దైవం'' లాంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడి గొప్పదనాన్ని చాటే డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక చందూ మొండేటి రచయితగా.. దర్శకుడిగా మళ్లీ ఈ చిత్రంతో ఫామ్ అందుకున్నాడు. పురాణాలతో ముడిపెట్టి ఈ కథను అల్లుకున్న తీరు మెప్పిస్తుంది. 'కార్తికేయ'లో మాదిరే దైవత్వం.. శాస్త్రీయ దృక్పథం అనే రెండు విరుద్ధమైన అంశాలను సమతూకంతో చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం ఎగుడుదిగుడుగా సాగినప్పటికీ.. ప్రేక్షకులను అతను చాలా వరకు ఎంగేజ్ చేశాడు.

చివరగా: కార్తికేయ-2.. ఎంగేజ్ చేస్తుంది

రేటింగ్ - 3/5