Begin typing your search above and press return to search.

కార్తికేయ సినిమాను ఈ అంశాలే దెబ్బకొట్టాయట!

By:  Tupaki Desk   |   22 May 2021 10:30 AM GMT
కార్తికేయ సినిమాను ఈ అంశాలే దెబ్బకొట్టాయట!
X
కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన 'చావుకబురు చల్లగా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఆమని ఒక కీలకమైన పాత్రను పోషించింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో తాజాగా ఈ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

" హీరో ఈ సినిమాలో శవాలను తన వాహనంలో శ్మశాన వాటికకు తరలించే పనిచేస్తూ ఉంటాడు. అలా ఒక శవాన్ని తీసుకెళ్లడానికి వెళ్లిన హీరో, అతని భార్యతో ప్రేమలోపడితే ఏమౌతుందనేదే ఈ సినిమా కథ. నిజంగా ఇది చాలా సాహసోపేతమైన కథ. హీరో .. హీరోయిన్ ను విసిగిస్తూ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించినట్టుగా దర్శకుడు చూపించాడు. ఇక ఆమని పాత్ర తాగుడికి అలవాటు అయినట్టుగా చూపించడం కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ పాత్రకి ఆమె అంగీకరించడం కూడా ఒక సాహసమే!

తండ్రి మంచంలో పడి ఉంటే, అంతకుముందు తల్లి ఇష్టపడిన వ్యక్తితో ఆమె పెళ్లిని జరిపించడానికి హీరో ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఇది ప్రపంచం ఊహించని సంఘటన .. ఇది భారతీయులకు నచ్చని అంశం. తండ్రి మరణించిన తరువాతనో .. తల్లి విడాకులు తీసుకున్న తరువాతనో అలా చేయడంలో అర్థం ఉంది. తండ్రి పాత్ర మరణించేలా చేసి .. తల్లికి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తే, భర్తను పోగొట్టుకున్న నాయికలో మార్పు వచ్చినట్టుగా చూపిస్తే బాగుండేది. ప్రేమ కోసం హీరో .. హీరోయిన్ ను విసిగిస్తున్నట్టుగా కాకుండా, అయ్యో అతని ప్రేమను ఆ అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుందేమో అనే రకంగా కథనం వెళ్లి ఉంటే ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చేదేమో" అని చెప్పుకొచ్చారు.