Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: కథకళి

By:  Tupaki Desk   |   18 March 2016 10:43 AM GMT
మూవీ రివ్యూ: కథకళి
X
చిత్రం: కథకళి

నటీనటులు: విశాల్ - కేథరిన్ థ్రెసా - మధు - శత్రు - శ్రీజిత్ రవి - జయప్రకాష్ - కరుణాస్ - మైమ్ గోపి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: బాలసుబ్రమణ్యన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాణం: శ్రీకృష్ణా క్రియేషన్స్ - విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పాండ్యరాజ్

ఒకప్పుడు రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసిన విశాల్.. ఈ మధ్య వైవిధ్యమైన సినిమాలతో సాగుతున్నాడు. యాక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమాలకు అతను కేరాఫ్ అడ్రస్ గా మారాడు. పల్నాడు - ఇంద్రుడు - జయసూర్య.. లాంటి సినిమాలు విశాల్ ను సరికొత్తగా చూపించాయి. ఈ కోవలోనే ఇప్పుడు ‘కథకళి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్. పాండ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు మూడు సార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కమల్ (విశాల్) నాలుగేళ్లు అమెరికాలో ఉండి.. తన పెళ్లి కోసం ఇండియాకు తిరిగొచ్చిన కుర్రాడు. అతను తను ప్రేమించిన మల్లీశ్వరి (కేథరిన్ థ్రెసా)తో పెళ్లికి రెడీ అవుతాడు. ఐతే ఇంకొన్ని రోజుల్లో అనగా.. అతనుండే ఊర్లో పెద్ద రౌడీ అయిన సాంబ (మధు) హత్యకు గురవుతాడు. ఐతే సాంబతో కమల్ కుటుంబానికి పాత కక్షలుండటంతో పోలీసులు అతడినే అనుమానిస్తారు. సాంబ అనుచరులు కూడా కమల్ నే టార్గెట్ చేస్తారు. దీంతో కమల్ తో పాటు అతడి కుటుంబమంతా వీళ్లకు దొరక్కుండా తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ఇంతకీ సాంబను చంపింది ఎవరు.. కమల్ ఆ సంగతి కనిపెట్టి ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు థ్రిల్లర్ జానర్లో సినిమాలు చేయడం అరుదు. ఒకవేళ చేసినా.. దానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. సినిమా మొత్తాన్ని థ్రిల్లర్‌ గా నడపకుండా ప్రథమార్ధాన్ని లైటర్ వీన్ లో నడిపించే ప్రయత్నం చేస్తారు దర్శకులు. ఇందులోనే రొమాన్స్ - కామెడీ లాంటి మసాలా అంశాలు దట్టించి.. అలా అలా నడిపించేసి.. ద్వితీయార్ధంలో అసలు కథలోకి వెళ్లి దాని మీద కథనాన్ని నడిపిస్తారు. విశాల్ కు ఈ ఫార్ములా బాగానే వర్కవుటైంది. విశాల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్లన్నీ ఈ తరహాలోనే సాగాయి. అతడి చివరి సినిమా ‘జయసూర్య’ కూడా అంతే. ‘కథకళి’ కూడా అదే ఫార్మాట్లో సాగుతుంది.

కానీ.. ఇందులోని ‘మిస్టరీ’ ట్రాక్ ఎంత థ్రిల్ ఇస్తుందో.. రొమాంటిక్ - కామెడీ ట్రాక్స్ అంతగా విసిగిస్తాయి. అసలు కథలోకి వెళ్లడానికి బాగా సమయం తీసుకుని.. అవసరం లేని ఎపిసోడ్లతో ప్రథమార్ధాన్ని సాగదీయడంతో ప్రేక్షకుడిలో సహనం నశిస్తుంది. రెండు గంటల నిడివే ఉన్న ఈ సినిమాలో.. ఇంకెప్పుడు కథ మొదలవుతుంది అని ప్రేక్షకుడు అసహనానికి గురయ్యేలా ప్రథమార్ధాన్ని అనవసర సన్నివేశాలతో సాగదీశాడు దర్శకుడు. ఓ రాంగ్ కాల్ ద్వారా మొదలయ్యే హీరో హీరోయిన్ల ప్రేమాయణం చాలా సాదాసీదాగా సాగుతుంది. కామెడీ కూడా పేలలేదు.

‘కథకళి’లో అసలు కథ సగం సినిమా అయ్యాకే మొదలవుతుంది. మర్డర్ మిస్టరీ చుట్టూ కథనాన్ని నడపడం మొదలయ్యాక ప్రేక్షకుడిలో ఆసక్తి కలుగుతుంది. ఒక్కసారి కథనం ట్రాక్ ఎక్కాక.. మళ్లీ గాడి తప్పదు. హీరో పాత్ర విశాల్ స్టయిల్లో కాకుండా మామూలుగా ఉండటంతో సస్పెన్స్ ఎలిమెంట్ బాగా ఎలివేట్ అయ్యింది. దీంతో మర్డర్ విషయంలో హీరో పాత్ర ఉందా లేదా.. అసలా పాత్ర ఉద్దేశం ఏంటి అన్నది ప్రేక్షకుడు కూడా గెస్ చేయడానికి అవకాశముండదు. దీని వల్ల చివరిదాకా సస్పెన్స్ కొనసాగుతుంది. మర్డర్ ఎవరు చేశారనే విషయంలో అనుమానితుల జాబితాను పెంచుతూ.. ఉత్కంఠను అంతకంతకూ పెంచుతూ.. ప్రేక్షకుల్ని చివరిదాకా ఎంగేజ్ చేశాడు దర్శకుడు.

కథానాయకుడు మరీ ఆలస్యంగా వీరత్వం చూపించడం మాస్ ప్రేక్షకులకు ఒకింత నిరాశ కలిగిస్తుంది కానీ.. ద్వితీయార్ధంలో వచ్చే సెల్ఫీ ఫైట్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాకు ఈ సన్నివేశం హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ లో ట్విస్టులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేయడంతో కొంచెం గందరగోళం నడుస్తుంది. ఐతే అసలు ట్విస్టు థ్రిల్ కలిగిస్తుంది. హీరోకు - విలన్ కు మధ్య శత్రుత్వాన్ని మరింత బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో పగతో రగిలిపోవడానికి తగిన కారణం కనిపించదు. పైగా ప్రథమార్ధంలో హీరో ప్రవర్తన చూస్తే అతడికో లక్ష్యం ఉన్నట్లు కనిపించదు. మరీ సిల్లీ సన్నివేశాలతో ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీశారు. నిడివి రెండు గంటలే కావడం సినిమాకు పెద్ద ప్లస్.

నటీనటులు:

విశాల్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. తన గత సినిమాలకు భిన్నమైన పాత్ర పోషించాడు విశాల్ ఇందులో. మామూలుగా అతడి సినిమాలో హీరోయిజం ఓ లెవెల్లో ఉంటుంది కానీ.. ఇందులో చాలా వరకు అతడి పాత్రను అండర్ ప్లే చేశారు. సినిమాలో చాలా వరకు మామూలు కుర్రాడిలా కనిపిస్తాడు విశాల్. తప్పనిసరి పరిస్థితులు ఎదురైనపుడు మాత్రమే హీరోయిజం చూపిస్తాడు. వీరత్వం చూపించే సన్నివేశంలో విశాల్ అదరగొట్టేశాడు. మొత్తంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశాల్ మెప్పించాడు. కేథరిన్ థ్రెసా తెలుగు సినిమాల్లో చూసిందానికి భిన్నంగా కనిపించింది ఇందులో. ఆమె పాత్రకు ప్రాధాన్యం తక్కువే కానీ.. ఉన్నంతలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో తెలుగు నటుడు మధు మెప్పించాడు. ఆయన నటన చూస్తే ఇతణ్ని మనోళ్లు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. ఎస్సైగా చేసిన నటుడు - శత్రు కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ అందరూ ‘కథకళి’కి బలంగా నిలిచారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ బ్యాగ్రౌండ్ స్కోర్.. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ద్వితీయార్ధంలో టెంపో ఎక్కడా తగ్గకుండా చూడటంతో వీళ్లిద్దరి పాత్ర కీలకం. శశాంక్ వెన్నెలకంటి మాటలు ఓకే. డబ్బింగ్ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. దర్శకుడు పాండ్యరాజ్ థ్రిల్లర్ సినిమా తీయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఈ జానర్ మీద గ్రిప్ చూపించాడు. మిస్టరీ చుట్టూ సాగే ద్వితీయార్ధంలో దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. దీని వరకు స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఐతే సినిమాలో సింక్ అవని రొమాంటిక్ ట్రాక్ తో పాటు ప్రథమార్ధంలో చాలావరకు అనవసర సన్నివేశాలతో మంచి కథాకథనాల్ని తనే దెబ్బ తీసుకున్నాడు. ప్రథమార్ధంలో దర్శకుడి ముద్ర అంటూ ఏమీ కనిపించదు.

చివరగా: కథకళి.. సగం కిల్.. సగం థ్రిల్

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre