Begin typing your search above and press return to search.

నాకు కరోనా సోకలేదు, ఈ ప్రచారం వద్దు: మహేష్ కత్తి

By:  Tupaki Desk   |   2 July 2020 3:02 PM GMT
నాకు కరోనా సోకలేదు, ఈ ప్రచారం వద్దు: మహేష్ కత్తి
X
వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ మహేష్ కత్తికి కరోనా వైరస్ సోకినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్‌చల్ చేశాయి. మహేష్ కత్తికి కరోనా సోకిందని తెలుస్తోందని ఫేస్‌బుక్ వేదికగా చాలామంది పోస్టులు పెట్టారు. అయితే దీనిపై స్వయంగా అతనే స్పందించాడు. తనకు కరోనా సోకలేదని, అలాంటి వార్తలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

తాను మీడియాలో ఉన్నందున కొద్ది రోజుల క్రితమే మీడియా ప్రతినిధులందరికీ కరోనా టెస్టులు నిర్వహించారని చెప్పాడు. ఈ క్రమంలో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని స్పష్టం చేశాడు. ఈ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని, కానీ ఎలాంటి ఆధారం లేకుండా తనపై అబద్దపు వార్తలు రాస్తూ, ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. ఇలాంటి అసత్యపు ప్రచారం చేసేవారు వెంటనే మానుకోవాలని చెప్పాడు.

ఇప్పటి వరకైతే తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనకు కరోనా సోకినా అధైర్యపడే వ్యక్తిని కాదని చెప్పాడు. కరోనాతో పోరాడి నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలనని చెప్పాడు. తనకు కరోనా వచ్చినట్లు అసత్యపు ప్రచారం జరగడంతో తన మిత్రులు ఫోన్ చేసి తన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు అన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే.