Begin typing your search above and press return to search.

క‌త్తి మ‌హేష్ ప‌రిస్థితేంటి?

By:  Tupaki Desk   |   27 Jun 2021 4:30 AM GMT
క‌త్తి మ‌హేష్ ప‌రిస్థితేంటి?
X
మొద‌ట ఫిలిం క్రిటిక్‌గా కాస్త‌ ఫేమ్ సంపాదించి.. ఆపై బిగ్ బాస్ షోతో పాపులారిటీ పెంచుకుని.. త‌ర్వాత రాజ‌కీయాల్లోకి కూడా అడుగు పెట్టి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిన క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌టం ఆయ‌న స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. చిత్తూరు జిల్లా వాసి అయిన క‌త్తి మ‌హేష్.. నెల్లూరు జిల్లాలో త‌న ఇన్నోవా కారులో ప్ర‌యాణిస్తుండ‌గా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైన‌ర్ లారీని మ‌హేష్ కారు వెనుక నుండి ఢీకొట్ట‌డంతో ఆయ‌న తీవ్ర గాయాల పాల‌య్యారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్ప‌టికీ క‌త్తి మ‌హేష్ త‌ల‌కు, కళ్ల‌కు, ముక్కుకు గ‌ట్టి దెబ్బ‌లు తాకాయి. ఆయ‌న్ని వెంట‌నే నెల్లూరులోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. త‌ర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నైకి త‌ర‌లించారు.

శ‌నివారం ఉద‌యం క‌త్తి మ‌హేష్ యాక్సిడెంట్ వార్త బ్రేక్ అయిన‌పుడు ఆయ‌నకు త‌గిలిన‌వి స్వ‌ల్ప గాయాలే అని.. ప్రాణాపాయం లేద‌ని వార్తలొచ్చాయి. ఐతే సాయంత్రానికి ప‌రిస్థితి మారింది. మ‌హేష్ ప‌రిస్థితి కొంచెం విష‌మంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. చెన్నైలో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న ఆసుప‌త్రి వ‌ర్గాలు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ముక్కుకు ఇప్ప‌టికే శ‌స్త్ర‌చికిత్స చేయ‌గా.. కంటికి కూడా స‌ర్జ‌రీ అవ‌స‌రం ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. త‌ల‌కు అయిన గాయం తీవ్ర‌త దృష్ట్యానే మ‌హేష్‌ను చెన్నైకి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యానికి శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతుండ‌టంతో వెంట‌నే వెంటిలేట‌ర్ పెట్టి చికిత్స అందించారు. బిగ్ బాస్‌తో పాపుల‌ర్ అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద విమ‌ర్శ‌లు, ఆయ‌న అభిమానుల‌తో గొడ‌వ కార‌ణంగా మ‌హేష్ వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. రాముడి మీద చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతోనూ ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. ద‌ళిత హ‌క్కుల కోసం పోరాడే సోషల్ యాక్టివిస్ట్ కూడా అయిన మ‌హేష్‌.. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు.