Begin typing your search above and press return to search.

ముగ్గురు స్టార్స్ ఉన్నా సౌండ్ లేదేం?

By:  Tupaki Desk   |   1 Jun 2022 1:30 AM GMT
ముగ్గురు స్టార్స్ ఉన్నా సౌండ్ లేదేం?
X
లేడీ సూపర్ స్టార్‌ నయనతార మరియు స్టార్‌ హీరోయిన్‌ సమంత కలిసి నటించిన చిత్రం కాతువాకుల రెండు కాదల్‌. తమిళంలో ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తెరకెక్కించాడు. విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా చాలా విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డ హీరో వారిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి.. ఇద్దరిని నొప్పించకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే ప్రయత్నాల సమాహారమే ఈ సినిమా కథాంశం.

థియేటర్ రిలీజ్ అయిన కాతువాకుల రెండు కాదల్‌ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు మరియు కన్నడంలో కూడా విడుదల అయ్యింది. తెలుగు లో ఇద్దరు హీరోలకు కూడా మంచి స్టార్‌ డమ్‌ ఉంది. అందుకే తెలుగు లో థియేట్రికల్‌ రిలీజ్ భారీగా ప్లాన్ చేశారు. కాని కొన్ని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదు. కాని తమిళనాడులో మాత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా రాకపోయినా కూడా ఖచ్చితంగా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే ఎక్కువ శాతం మంది చూసే అవకాశం ఉందని భావించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో విడుదల అయిన కే ఆర్ కే సినిమా పెద్దగా సందడి చేయడం లేదు. విజయ్ సేతుపతికి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది.. మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇక నయనతార మరియు సమంత కూడా స్టార్‌ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన వారే.

ఇప్పటికి కూడా ఈ ముగ్గురికి తెలుగు లో మంచి స్టార్‌ డమ్‌ ఉంది. అయినా కూడా వీరు ముగ్గురు చేసిన సినిమా కాతువాకుల రెండు కాదల్ తెలుగు వర్షన్‌ మాత్రం పెద్దగా ఆధరణకు నోచుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ వారు ఎక్కువగా ప్రమోట్‌ చేయలేదు అంటూ కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం అరవ సినిమా డబ్బింగ్ కదా ఏముంది అన్నట్లుగా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ముగ్గురు స్టార్స్ ఉన్నా కూడా సినిమా ను పెద్దగా జనాలు చూసేందుకు ఆసక్తి చూపించక పోవడం ఆశ్చర్యంగా ఉందంటూ సినీ జనాలతో పాటు ఓటీటీ సినిమాల విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీరు ముగ్గురు విడి విడిగా చేసిన సినిమాలు మంచి సక్సెస్‌ అయిన దాఖలాలు ఉన్నాయి. కాని ఈ సినిమా మాత్రం ఎందుకో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వలేదు. కనీసం ఓటీటీ లో కూడా కనెక్ట్‌ కాలేదు.