Begin typing your search above and press return to search.

సొంత అర్మీనే.. కౌశల్ కు ఎదురు తిరిగింది!

By:  Tupaki Desk   |   26 Feb 2019 5:29 AM GMT
సొంత అర్మీనే.. కౌశల్ కు ఎదురు తిరిగింది!
X
బిగ్ బాస్ 2 సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ మందాకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారం అవుతున్న సమయంలో కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్స్ మామూలుగా హడావుడి చేయలేదు. ఇతర బిగ్ బాస్ పోటీదారులపై ట్రోలింగ్ కు కూడా పాల్పడ్డారు. కౌశల్ వ్యతిరేకులు మాత్రం అసలు కౌశల్ ఆర్మీ అంతా ఫేక్ అని కౌశల్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని కూడా విమర్శించారు.

ఇదిలా ఉంటే తాజాగా కౌశల్ ఆర్మీ మెంబర్లలో చాలామంది కౌశల్ కు వ్యతిరేకంగా మారిపోయారు. చాలామంది కౌశల్ ఆర్మీ మెంబర్స్ మీడియా ముందుకు వచ్చి కౌశల్ గురించి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ కు యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. ఆ ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చుపెడతానని కౌశల్ అప్పట్లో ప్రకటించాడు. కానీ అలా చేయకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ కౌశల్ ను ప్రశ్నించారట. దానికి సమాధానంగా "నా డబ్బు నేను ఎలాగైనా ఖర్చు పెడతాను" అంటున్నాడని ఆరోపిస్తున్నారు. అంతే కాదు తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ట్రోల్ చేయమని ఫ్యాన్స్ ను ప్రోత్సహిస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నారు.

ఎక్కడికి వచ్చినా అభిమానుల చేత డబ్బు ఖర్చుపెట్టిస్తున్నాడని.. ఏ చిన్న ఈవెంట్ లో పాల్గొనాలన్నా డబ్బు ఆశిస్తున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ వేరు.. ఇప్పుడు మేము చూస్తున్న కౌశల్ వేరని అభిమానులు మొరపెట్టుకుంటున్నారు. కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్.. కౌశల్ పై అభిమానంతో సొంత డబ్బు ఖర్చుపెట్టుకున్న ఇతర సభ్యులు ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు.

అనామిక అనే లేడీ ఫ్యాన్ మాట్లాడుతూ "కౌశల్ ఆర్మీ గ్రూపులో మనం ఏదైనా విషయంపై ప్రశ్నిస్తే మనల్ని టార్గెట్ చేసేలా చేస్తారు. మనపై అందరూ దాడి చేస్తారు. మనల్ని గ్రూపు నుంచి తీసేస్తారు. మనం డబ్బు ఇవ్వాలి... కానీ మనకు ఆ డబ్బు ఎలా వాడుతున్నారు? అని అడిగే హక్కు ఉండదు" అని చెప్పింది. కౌశల్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాయలసీమ అధ్యక్షుడు హరికుమార్ మాట్లాడుతూ "వైజాగ్‌లో జరిగిన సక్సెస్ మీట్ కోసం పది వేలు.. అనంతపూర్ లో జరిగిన సక్సెస్ మీట్ కోసం ఇరవై ఎనిమిది వేలు పంపాను...కర్నూలులో జరిగిన సక్సెస్ మీట్ కోసం 80 శాతం నేను ఖర్చు పెట్టాను. దాదాపు 500 మందికి అన్నదానం చేశాను. వాటర్ ప్యూరిఫైయర్లు పంపించాను. అనాధ ఆశ్రమాలకోసమని చాలాసార్లు డబ్బు పంపాను. ఇంత చేసినప్పటికీ కౌశల్ ఒక చిన్న మెసేజ్ పెట్టగానే అందరూ నాపై రివర్స్ అయిపోయి తిట్టారు" అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్ లో కౌశల్ కు వ్యతిరేకంగా న్యూస్ వస్తోందని తెలిసి 'పీఎం కు చెప్పి ఇప్పుడే ఆ ఛానల్ వారికి ఫోన్ చేయించాను.. వాళ్ళు ఇప్పుడు ఆపేశారు" అంటూ ఒక ఫ్యాన్ తో కౌశల్ మాట్లాడిన రికార్డెడ్ ఫోన్ కాల్ టీవీ ఛానల్ వారికి లభించింది. పీఎం ఆఫీస్ నుంచి మాకు కాల్ రావడం ఏంటి.. మేము ఆ ప్రోగ్రాం ఆపడం ఏంటి? అసలు ఇలాంటి వ్యక్తిని మీరు ఎలా నమ్మారు అంటూ సదరు టీవీ ఛానల్ వారు కౌశల్ ఆర్మీసభ్యులతో ఒక పెద్ద డిబేట్ పెట్టారు. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న ఫ్యాన్స్ ను కౌశల్ చేజేతులారా పోగొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.