Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'ఉద్య‌మసింహం' యూట్యూబ్‌ లో

By:  Tupaki Desk   |   4 April 2019 7:56 AM GMT
కేసీఆర్ ఉద్య‌మసింహం యూట్యూబ్‌ లో
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఉద్యమ సింహం’. నటరాజన్‌, సూర్య, పి.ఆర్‌. విఠల్‌బాబు ప్రధాన పాత్రధారులు. అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మాత. ఆయ‌నే ఈ చిత్రానికి కథా రచయిత. తెలంగాణ సాధ‌న కోసం కేసీఆర్ త‌ల‌పెట్టిన ఉద్య‌మాన్ని విజువ‌లైజ్ చేశారు. అన్ని ప‌నులు పూర్తి చేసి సెన్సార్ నుంచి క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. మార్చి 29న సినిమా రిలీజ్ కి సంబంధించి మీడియా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అయితే ఈ సినిమాని బ‌యోపిక్ కేట‌గిరీలో ప‌రిగ‌ణించి రిలీజ్ విష‌యంలో ఇబ్బందులు క్రియేట్ చేశార‌ని- రిలీజ్ కానీకుండా అడ్డుకున్నార‌ని ద‌ర్వ‌క‌నిర్మాత‌లు వాపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సినిమా రిలీజ్ వేళ త‌మ‌పై కుట్ర జ‌రిగింద‌ని సినిమాని రిలీజ్ చేయ‌నీకుండా థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని బెదిరించార‌ని నేడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మీడియాకెక్కారు. హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో జ‌రిగిన తాజా మీడియా స‌మావేశంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నాగేశ్వ‌ర‌రావు - కృష్ణంరాజు ఆల్మోస్ట్ క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యారు.

రాజకీయాలకు అతీతంగా తీస్తున్న చిత్రమిది. ఇది బ‌యోపిక్ కాదు. కేవ‌లం ఉద్య‌మ నేప‌థ్యంపై తీసిన చిత్ర‌మిది. కేసీఆర్‌ గారి గురించి ప్రజలకు తెలియని విషయాలెన్నో చిత్రంలో చూపిస్తున్నాం. సినిమాలో ఐదు పాటలున్నాయని ఉద్య‌మ‌స్ఫూర్తిని తెలియ‌జేస్తాయ‌ని తెలిపారు. కేసీఆర్‌ పై అభిమానంతో తీశాం. అయితే ఈ చిత్రం రిలీజ్ కోసం తెరాస‌ను కానీ - కేసీఆర్‌ ని కానీ సాయం కావాల‌ని తాము కోర‌లేద‌ని తెలిపారు.

ఎల‌క్ష‌న్ ముందే రిలీజ్ చేస్తే ఉద్య‌మం కోసం కేసీఆర్ ఎంత ప్ర‌యాస ప‌డ్డార‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంద‌ని భావించి రిలీజ్ చేస్తున్నామ‌ని - అయితే రిలీజ్ కాకుండా థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని బెదిరించార‌ని వెల్ల‌డించారు. అందుకే ఈ చిత్రాన్ని యూట్యూబ్ స‌హా శాటిలైట్‌ - సామాజిక మాధ్య‌మాల్లో ఉచితంగా రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు. టీవీ చానెళ్ల‌కు ఉచితంగా ఈ సినిమాని ఇచ్చేస్తున్నామ‌ని స‌ద‌రు నిర్మాత‌లు వెల్ల‌డించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇలా అయితే న‌ష్ట‌పోతారు క‌దా? అని ప్ర‌శ్నిస్తే తాము డ‌బ్బు సంపాదించేందుకు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌లేద‌ని నిర్మాత వెల్ల‌డించారు. రిలీజ్ ఇబ్బందుల‌పై కేసీఆర్ సాయం కోర‌లేదా? అని ప్ర‌శ్నిస్తే.. ఆ ఉద్ధేశం లేద‌ని వారి సాయం కోర‌లేమ‌ని అన్నారు.