Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల బంద్ పై కేసీఆర్ డెసిష‌న్?

By:  Tupaki Desk   |   14 March 2020 1:00 PM GMT
థియేట‌ర్ల బంద్ పై కేసీఆర్ డెసిష‌న్?
X
కరోనా క‌ల్లోలంపై ప్ర‌భుత్వాలు కంగారు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. వైరస్ ని కట్టడి చేసేందుకు తాజాగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు.. కాలేజీలకు ఈ నెల 31 వరకు సెలవులను ప్రకటించింది. క‌రోనా ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకున్న సీరియ‌స్ డెసిష‌న్ ఇది. శనివారం సీఎం కేసీఆర్‌ నేతృత్వం లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జ‌న స‌మూహాలు ఉండే చోట్ల‌ను బ్లాక్ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ అయ్యింది.

ఆ మేర‌కు అసెంబ్లీ హాల్లో జ‌రిగిన స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల్ని చ‌ర్చించారు. ముఖ్యంగా ఈ నెలఖారు వరకు ఫంక్షన్ హాల్స్.. స్కూల్స్.. కాలేజీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు థియేట‌ర్ల‌ను మూసివేయాల‌న్న నిర్ణ‌యం వెలువ‌రించడం తో ప‌రిశ్ర‌మ లో క‌ల‌క‌లం మొద‌లైంది.

ఖమ్మం జిల్లా వాసి ఇటలీ ప‌ర్య‌ట‌న అనంత‌రం రాష్ట్రానికి రావ‌డం.. అటుపై ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవ‌డం లో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అయితే గ‌త వారం రోజులుగా వినోద ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండ‌నుంది? అన్న‌దానిపై తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. థియేట‌ర్ల బంద్ .. షూటింగ్ ల బంద్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని నిర్మాత‌లు చెబుతున్నా .. లేదు థియేట‌ర్లు బంద్ పై నిర్ణ‌యించుకున్నార‌ని పంపిణీవ‌ర్గాల్లో వారం రోజులుగా చ‌ర్చ సాగుతూనే ఉంది. నేడు (శ‌నివారం) తెలంగాణ అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే విధానాన్నిబట్టి.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గాని.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ బంద్ ను అమలు పరిచే వీలుంద‌ని అంత‌టా చ‌ర్చ సాగింది.

ఎట్ట‌కేల‌కు సీఎం కేసీఆర్ ఈనెలాఖ‌రు వ‌ర‌కూ థియేట‌ర్ల బంద్ కు పిలుపునివ్వ‌డం స‌ర్వ‌త్రా వేడెక్కిస్తోంది. తాజా స‌న్నివేశం చూస్తుంటే ఈనెల 25న రిలీజ‌వుతున్న ఐదు సినిమాల‌పై పంచ్ ప‌డిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే నానీ - సుధీర్ బాబు `వీ` చిత్రాన్ని వాయిదా వేసిన‌ట్టు అధికారికంగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇక వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ్ తేదీల్ని మార్చే వీలుంద‌ని ప్ర‌చార‌మైంది. ఇక ఇప్ప‌టికే ప‌బ్లిసిటీ కోసం.. రిలీజ్ ప్ర‌క‌ట‌న‌ల కోసం బోలెడంత ఖ‌ర్చు చేసిన నిర్మాత‌ల‌కు ఇప్పుడు అద‌న‌పు బ‌డ్జెట్ అవ‌స‌రం ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ఏప్రిల్ మొద‌టి వారం రిలీజ్ ల‌పై బంద్ ప్ర‌భావం ఏ మేర‌కు ప‌డుతుంది? అన్న‌ది చూడాలి. ఇప్పుడు వాయిదా ప‌డిన సినిమాల‌కు ఏప్రిల్ ఆరంభంలో ఏ స్లాట్ దొరుకుతుంది? ఇవే సినిమాల్ని ఏప్రిల్ లో మొద‌టి వారాల్లో రిలీజ్ చేయాల్సి వ‌స్తే స‌న్నివేశ‌మేమిటి? థియేట‌ర్ల స‌ర్ధుబాటు అంశం ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. ఒకేసారి డ‌జ‌ను సినిమాలు రిలీజ‌య్యే స‌న్నివేశం ఇక‌పై క‌నిపించ‌నుంద‌ని దీనిని బ‌ట్టి అర్థమ‌వుతోంది.