Begin typing your search above and press return to search.

వెంకటేష్ ఏం స్టార్.. కేసీఆర్ సందేహం

By:  Tupaki Desk   |   22 April 2016 3:30 PM GMT
వెంకటేష్ ఏం స్టార్.. కేసీఆర్ సందేహం
X
మన స్టార్ హీరోల్ని కేవలం వాళ్ల పేర్లతో సంబోధించడం అభిమానులకు ఇష్టముండదు. చిరంజీవి అనగానే ఆ పేరు ముందు మెగాస్టార్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ అనగానే పవర్ స్టార్ అని.. మహేష్ బాబు అనగానే ప్రిన్స్ అని ఆటోమేటిగ్గా నోటి నుంచి వచ్చేస్తుంది. సీనియర్ హీరో వెంకటేష్ పేరు ముందు కూడా ‘విక్టరీ’ అనే మాట ఎప్పుడో వచ్చి చేరింది. ఐతే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మాత్రం ఈ విక్టరీ గురించి తెలియదట. ఈ రోజు బాలయ్య వందో సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న కేసీఆర్.. అక్కడ అతిథి ప్రసంగం చేస్తూ వెంకటేష్ ను ఎలా సంబోధించాలో తెలియక ఇబ్బంది పడిపోయారు.

ముందు చిరంజీవి పేరెత్తుతూ మెగాస్టార్ అన్న కేసీఆర్.. వెంకటేష్ ప్రస్తావన వచ్చినపుడు.. ఆయన ఏం స్టారో తెలియదు అంటూ నవ్వేశారు. వెంటనే పక్కనున్న వాళ్లు ‘విక్టరీ’ అన్న పదాన్ని అందించారాయనకు. దీంతో ఆయన విక్టరీ వెంకటేశా.. అంటూ సరదాగా వెంకీని పలకరించారు. అంతే.. అతిథులందరూ గొల్లుమని నవ్వేశారు. ఇక ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ గురించి మాట్లాడుతూ.. తెలుగులో ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా రావడం గొప్ప విషయమని.. ఈ సినిమాను ఇక్కడున్న అతిథులందరితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాన్ని కల్పించాలని కేసీఆర్ అన్నారు. దీనికి సరేనంటూ బాలయ్య తల ఊపాడు.