Begin typing your search above and press return to search.

కేసీఆర్ సేల్స్ మెన్ ఎందుక‌య్యారు?

By:  Tupaki Desk   |   30 Jun 2019 4:34 AM GMT
కేసీఆర్ సేల్స్ మెన్ ఎందుక‌య్యారు?
X
ఆయ‌నో ముఖ్య‌మంత్రి. మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు. కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఇదేమీ కొత్త విష‌యం కాదు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రితో మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రి భేటీ కావ‌టం.. ఆ సంద‌ర్భంగా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు తెర మీద‌కు తేవ‌టం ఎప్పుడూ చూసేదే. అయితే.. అందుకు భిన్నంగా ఒక ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌టం.. అందులో తాను ప్ర‌తిపాదించిన విష‌యాల్ని బ‌ల‌ప‌ర్చేలా గ‌ణాంకాల్ని చెప్ప‌టం ఎందుకు? ఇంత‌కూ ఇదంతా ఎవ‌రి మ‌ధ్య‌న చోటు చేసుకుందంటే? తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య జ‌రిగిన భేటీలో క‌నిపించిన దృశ్యం. ఇది దేనికి నిద‌ర్శ‌నం?

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ అయిన సంద‌ర్భంగా శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి గోదావ‌రి నీటిని మ‌ళ్లించి.. ఎంచ‌క్కా రెండు తెలుగు రాష్ట్రాల వారు వాడుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను జ‌గ‌న్ కు కేసీఆర్ చేయ‌టం తెలిసిందే. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల మ‌ళ్లింపుపై తెలంగాణ సీఎం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌టం.. గోదావ‌రి.. కృష్ణా జ‌లాలు ఎంత మేర తెలుగు రాష్ట్రాల‌కు అందుబాటులో ఉన్నాయో గ‌ణాంకాల రూపంలో వివ‌రించారు.

1972 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అంటే గ‌డిచిన 44 ఏళ్ల పాటు వ‌చ్చిన ప్ర‌వాహాల‌పై స‌వివ‌ర విశ్లేష‌ణ చేసే బాధ్య‌త కేసీఆర్ తీసుకున్నారు. జూన్ నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు నెల‌ల వారీగా స‌గ‌టు ప్ర‌వాహాలు.. సంవ‌త్స‌రాల వారీ స‌గ‌టు ప్ర‌వాహాల వివ‌రాలు తీసుకున్నారు. అదే స‌మ‌యంలో కృష్ణా జలాల‌కు సంబంధించి 1990 నుంచి 2013-14 వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ఆధారంగా కేసీఆర్ త‌న ప్ర‌జంటేష‌న్ ఇచ్చిన‌ట్లుగా తెలిసింది.

ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. తాను చెప్పిన మాట‌ల‌కు బ‌లం చేకూరేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. గ‌ణాంకాల్ని ఐదేళ్ల క్రితం వ‌ర‌కూ చూపించి.. తాజా లెక్క‌ల్ని ఎందుకు వ‌దిలేసిన‌ట్లు? అన్న‌ది ఒక క్వ‌శ్చ‌న్. ఒక సేల్స్ మెన్ మాదిరి త‌న ఆలోచ‌న‌ను జ‌గ‌న్ ఒప్పుకునేలా కేసీఆర్ ఇంత భారీ క‌స‌ర‌త్తు ఎందుకు చేసిన‌ట్లు? అన్న‌ది మ‌రో సందేహం.

తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం తెగ ఆరాట‌ప‌డే కేసీఆర్.. జ‌గ‌న్ కు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ లోని అంశాల్ని తెలిపిన తీరుపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. క్రాస్ చెక్ చేసుకోకుండా ముందుకెళితే ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు.

ప్ర‌పంచంలో ఏ సేల్స్ మెన్ అయినా త‌న ఉత్ప‌త్తిని అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇందుకోసం త‌న ఉత్ప‌త్తిలో ఉన్న మంచిని చెప్పినంత బాగా..చెడును ప్ర‌స్తావించ‌రు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సేల్స్ మెన్ అవ‌తార‌మెత్తి.. జ‌గ‌న్ క‌స్ట‌మ‌ర్ గా మారిన వేళ‌.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ లో ప్ర‌స్తావించిన అంశాల‌ను రివ‌ర్స్ మేనేజ్ మెంట్ లో చెక్ చేసుకోవాలి. కేసీఆర్ ప్ర‌తిపాదించిన అంశాల‌న్ని ఉభ‌య‌తార‌క‌మా? తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేశారా? అన్న‌ది కూడా చూసుకోవాల‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. గోదావ‌రి జలాలు కృష్ణాలో క‌ల‌ప‌టం ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న ప్ర‌యోజ‌నాల విష‌యంలో మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల్సిందేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.