Begin typing your search above and press return to search.

వాటికి మాత్రమే రిటైర్మెంట్‌ తీసుకున్నాడట

By:  Tupaki Desk   |   5 Jan 2019 6:08 AM GMT
వాటికి మాత్రమే రిటైర్మెంట్‌ తీసుకున్నాడట
X
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సంగీత దర్శకుల్లో కీరవాణి చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వచ్చిన యువ సంగీత దర్శకులకు సైతం పోటీగా నిలుస్తూ వరుసగా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ వస్తున్నాడు. ‘బాహుబలి 2’ సమయంలో తాను రిటైర్మెంట్‌ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ సమయంలో కొంతమంది నిర్మాతలపై మరియు దర్శకులపై కీరవాణి సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్‌ టేస్ట్‌ లేని వారు కొందరు తన ట్యూన్స్‌ ను వద్దన్నారంటూ సంచన ఆరోపణలు చేసి చర్చనీయాంశం అయ్యాడు. బాహుబలి తర్వాత కీరవాణి సంగీతం వినమేమో అంటూ అంతా భావించారు.

రాజమౌళి తదుపరి సినిమాకు కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవాల్సిందే అనుకున్నారంతా. కాని కీరవాణి బాహుబలి తర్వాత కూడా తన సంగీత ప్రస్థానంను కొనసాగిస్తున్నాడు. అయితే మునుపటితో పోల్చితే కాస్త తక్కువగా ఈయన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘ఎన్టీఆర్‌’ సినిమాకు సంగీతాన్ని అందించిన కీరవాణి, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎన్టీఆర్‌ విడుదల సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన కీరవాణి తన రిటైర్మెంట్‌ గురించి మాట్లాడాడు.

నేనెప్పుడు సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్‌ అవ్వాలనుకోలేదు, నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులను తప్పించుకునేలా రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్నాను. నేనొక ట్యూన్‌ చేస్తే అది నిర్మాత మనవరాలికి నచ్చలేదని చెప్పి తిరష్కరించారు. అలాంటి వారితో వర్క్‌ చేయడం నుండి రిటైర్మెంట్‌ తీసుకున్నాను. నేను చేసిన ట్యూన్‌ ను మరొకరితో సరి చేయించినటువంటి ఫిల్మ్‌ మేకర్స్‌ నుండి రిటైర్మెంట్‌ తీసుకున్నాను అన్నాడు. కీరవాణి మాటలను బట్టి ఇకపై తనపై పూర్తి నమ్మకం పెట్టి, తనతో వర్క్‌ చేయాలనుకునేవారితోనే సినిమాలు చేయాలని భావిస్తున్నాడన్నమాట. అంటే కీరవాణి ఇకపై సంవత్సరంకు రెండు మూడు సినిమాలే చేసే అవకాశం ఉందేమో.