Begin typing your search above and press return to search.

జాతీయ ఉత్తమ నటి మరోసారి డీ గ్లామర్ రోల్ తో అదరగొడుతుందా..?

By:  Tupaki Desk   |   19 Oct 2022 2:30 AM GMT
జాతీయ ఉత్తమ నటి మరోసారి డీ గ్లామర్ రోల్ తో అదరగొడుతుందా..?
X
కథ నచ్చితే పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామర్ రోల్స్‌ లో కనిపించడానికి సై అంటున్నారు మన హీరోయిన్లు. ఓవైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు ఆ ఫేజ్ నుంచి బయటికొచ్చి రా అండ్ రస్టిక్ గా కనిపించడానికి కూడా రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు.

'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ అవార్డ్ గెలుచుకుంది.

ఓ పక్క ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో బంజారా యువతిగా డీ గ్లామర్ రోల్ చేస్తూనే.. ఇంకో పక్క ‘మిస్ ఇండియా’ అంటూ గ్లామర్ రోల్ లో కనిపించింది. 'సర్కారు వారి పాట' చిత్రంలో మోడ్రన్ గర్ల్ గా నటించిన కీర్తి సురేష్.. ఇప్పుడు ''దసరా'' సినిమాలో గ్రామీణ యువతిగా మారిపోయింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాలో కీర్తి మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ ను ఆవిష్కరించారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇందులో మహానటి రా అండ్ రస్టిక్ గా ఎంతో అందంగా కనిపించింది. ఇది సినిమాలో వెన్నెల పాత్ర ఎలా ఉండబోతుందో నిర్వచిస్తుంది. అయితే ఈ పోస్టర్ విడుదలైన వెంటనే, కీర్తి సురేష్ పాత్రను 'రంగస్థలం' లో సమంత మరియు 'పుష్ప' లోని రష్మిక మందన్న పాత్రలతో పోల్చడం ప్రారంభించారు నెటిజన్లు.

రామలక్ష్మిగా సామ్ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. శ్రీవల్లిగా రష్మిక కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలలో కొంచెం అతిగా అనిపించినా ఓవరాల్ గా ఓకే అనిపించింది. ఇప్పుడు కీర్తి సురేష్ తనదైన శైలిలో అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే 'చిన్ని' సినిమాలో రస్టిక్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మరి 'దసరా' లో తెలంగాణ అమ్మాయి వెన్నెలగా జాతీయ ఉత్తమ నటి ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.