Begin typing your search above and press return to search.

ఎమోషనల్ గా కనెక్టయిపోయా

By:  Tupaki Desk   |   2 May 2018 4:12 AM GMT
ఎమోషనల్ గా కనెక్టయిపోయా
X
బోలెడు గ్లామర్ తోపాటు బ్రహ్మాండమైన యాక్టింగ్ టాలెంట్ హీరోయిన్ కీర్తి సురేష్ సొంతం. అందుకే తెలుగు సినిమాల్లో నటనకు భాష్యం చెప్పిన మహానటి సావిత్రి పాత్ర చేసే అవకాశం ఆమెను వరించింది. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ లో కీర్తిని చూస్తే అచ్చు సావిత్రిలాగానే ఉంది అనిపించింది. అంతగా మెప్పించిన కీర్తి మహానటి సినిమా టైటిల్ రోల్ చేయడం గురించి చెప్పాల్సిన క్షణాన మాటల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది.

మహానటి ఆడియా లాంచ్ ఈవెంట్లో కీర్తి స్పీచ్ మొదట్లోనే కాస్త నెమ్మదిగా.. ఎక్కువ సేపు మాట్లాడతానంటూ మొదలుపెట్టింది. ఈ రోల్ చేయడానికి తాను ఫస్ట్ నో అనే చెప్పానంది. ‘‘ఈ మూవీ డైరక్టర్ నాగ్ అశ్విన్.. ప్రొడ్యూసర్ స్వప్నా దత్ వచ్చి నన్ను కలిసి మహానటి సావిత్రి జీవిత గాథతో సినిమా తీస్తున్నామని చెప్పారు. నేనేంటి.. సావిత్రి పాత్ర చేయడమేంటి? అది టూమచ్ ఛాలెంజింగ్ రోల్. నావల్ల కాదని చెప్పేశాను. కానీ నాగి, స్వప్న మాత్రం వదిలిపెట్టలేదు. నువ్వు చేయగలవంటూ నమ్మకంతో సమాధానం చెప్పారు. నేను కన్విన్స్ అయ్యేంతవరకు వదిలిపెట్టలేదు. అసలు ఈ రోల్ చేసినందుకు మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది నానికే.. నువ్వు ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పినవాడు తనే. థ్యాంక్యూ’’ అంటూ కీర్తి సురేష్ ఈ సినిమా ఓకే చెయ్యడం వెనుక బ్యాక్ గ్రౌండ్ చెప్పుకొచ్చింది.

‘‘ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ కాకపోయినా సమంత నటించింది. హీరో దుల్కర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్యామిలీ ఫ్రెండ్. విజయ్ దేవరకొండతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా అతడితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అంటూ తన కోస్టార్లను కీర్తి తెగ పొగిడింది. ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్లను పేరుపేరునా ప్రస్తావించి వాళ్లందరి నటనను మెచ్చుకుంది.

‘‘నేను ఎన్నో మాట్లాడదామని అనుకున్నాం. కానీ ఇప్పుడు మాటలే దొరకడం లేదు. నేను ఎమోషనల్ గా కనెక్టయిన ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ సినిమా చేయడం ఒక అందమైన ప్రయాణం లాంటిది. సావిత్రి గారు ఎక్కుడున్నా ఆవిడ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నా. మా ప్రయాణం పూర్తయింది. ఇప్పుడు దీనిని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. థియేటర్లలో ఈ సినిమా చూసి హిట్ చేయాలని కోరుతున్నా’’ అంటూ మహానటి మూవీతో తనకున్న ఎమోషనల్ ఎటాచ్ మెంట్ గురించి కీర్తి చెప్పుకొచ్చింది.