Begin typing your search above and press return to search.

కోర్టు అనుకూల తీర్పుతో `కాంతారా` ఆత్మ‌కు శాంతి

By:  Tupaki Desk   |   25 Nov 2022 4:11 PM GMT
కోర్టు అనుకూల తీర్పుతో `కాంతారా` ఆత్మ‌కు శాంతి
X
కేజీఎఫ్ ఫ్రాంఛైజీ త‌ర్వాత `కాంతార` పాన్ ఇండియా స‌క్సెస్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మకు సూప‌ర్ కిక్కిచ్చింది. చిత్ర‌బృందంతో పాటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా సంబ‌రాల్లో మునిగి తేలాయి. `కాంతార` అట‌వీ ప్రాంతంలోని ఒక గ్రామంలో సాగే యాక్షన్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో చ‌క్క‌ని విజువ‌ల్ ఫీస్ట్ గా తెర‌కెక్కింది. జాన‌ప‌ద నేప‌థ్యం ఎలివేష‌న్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆయ‌నే ఇందులో క‌థానాయ‌కుడు. KGF నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ ప‌తాకంపై నిర్మించారు. థియేట‌ర్ల‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇటీవ‌లే ఓటీటీలో కూడా విడుద‌లైంది.

కానీ ఊహించ‌ని విధంగా థియేట్రిక‌ల్ వీక్ష‌ణ‌తో పోలిస్తే ఓటీటీ వీక్ష‌ణ‌లో నిరాశ ఎదురైంది. డిజిట‌ల్లో అంత‌గా మెప్పించ‌లేక‌పోయింద‌ని కూడా నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ సినిమా కోర్టు వివాదం తెలిసిందే. కాంతార చిత్రానికి కీలకమైన పాటగా ``వ‌రాహ రూపం..`` ఉత్కంఠ పెంచుతుంది.

ఈ చిత్రానికి ఆత్మ లాంటి బాణి ఇది. కానీ ఇది న‌వ‌రసం అనే పాట‌కు కాపీ అంటూ కేరళకు చెందిన `తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్` కాంతారా నిర్మాతలపై కాపీ క్యాట్ (ప్లాగ‌రిజం) కేసును నమోదు చేసింది. దీంతో ఆ పాట‌ను ఎడిట్ చేయాల్సి వ‌చ్చింది. కానీ కేరళ కోర్టు ఈరోజు పాటపై నిషేధాన్ని ఎత్తివేసింది. అప్ప‌టికే ఈ పాట లేకుండానే అమెజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

నిజానికి ఈ పాట‌పై వివాదం త‌లెత్త‌గా తొలుత స‌ద‌రు మ్యూజిక్ బ్యాండ్ కు అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంది. దానివ‌ల్ల పాట‌ను మ‌ధ్యంత‌ర నిలుపుద‌ల (విచార‌ణ తేలే వ‌ర‌కూ కొన్నాళ్ల పాటు ఆపేయ‌డం) చేసారు. కానీ ఇంత‌లోనే ఈ కేసు కీల‌క మ‌లుపు తిరిగి అదే న్యాయస్థానం లోపాన్ని స‌వ‌రించింది.

ఈ పాట‌లో కాపీ క్యాట్ అంశాలేవీ లేవ‌ని ధృవీక‌రించింది. దీంతో కాంతార టీమ్ కి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఇప్ప‌టికే ఈ మూవీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ఆడింది. త్వరలో డిజిటల్ వెర్షన్ లో వరాహ రూపం పాటను రీప్లేస్ చేస్తారా లేదా? అన్న‌ది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.