Begin typing your search above and press return to search.

వరదల ప్రభావానికి గురైన మలయాళ చిత్ర సీమ

By:  Tupaki Desk   |   23 Aug 2018 7:10 AM GMT
వరదల ప్రభావానికి గురైన మలయాళ చిత్ర సీమ
X
మునుపెన్నడూ లేని విధంగా కేరళను వరదలు అతలాకుతలం చేసేశాయి. గడిచిన రెండు మూడు రోజుల నుంచి వర్షం తగ్గుముఖం పట్టి.. తిరిగి కోలుకుంటోంది గాడ్స్ ఓన్ కంట్రీ. అయితే దాని ప్రభావం.. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తోంది. ఈ నెల 24 - 25 న ఓణం కానుకగా విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు విడుదల తేదీలు మార్చుకోవడం గమనార్హం. అయితే వరదలనుంచి కోలుకున్న తర్వాత .. తిరిగి పట్టాలెక్కిన సినిమా మాత్రం ఒక్కటే కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా పృధ్విరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'లూసిఫర్' మాత్రమే షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టింది.

ఇంకా మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మధురరాజా' - నీరజ్ మణియన్ పిళ్లైరాజు - మానసా రాధాకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న 'సకలకళాశాల' - ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుపత్తియొన్నామ్ నూట్టాండు' - కుంచాకో బోబన్ హీరోగా తెరకెక్కుతున్న 'అల్లూ రామేంద్రన్' సినిమాలన్నీ వరదలు కారణంగా ఎక్కడ షూటింగ్ అక్కడ ఆపేశాయి. ఇంకా చాలా సినిమాలు .. షూటింగ్ జరుపుకోడానికి నీరు లేని లొకేషన్స్ దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక మరి కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయినా సరే థియేటర్ప్ లోకి వరదనీరు చేరిన కారణంగా వాటిని మూసి వేయాల్సిన పరిస్థితులొచ్చాయి. మొత్తానికి ఈ సంవత్సరం మలయాళీలకు - మలయాళ చిత్ర సీమకు ఓణసధ్యను ఆనందంగా ఆరగించే భాగ్యం లేకపోవడం ఎంతైనా దురదృష్టకరం.