Begin typing your search above and press return to search.

అప్పుడు డీమానిటైజేషన్..ఇప్పుడు బాహుబలి-2

By:  Tupaki Desk   |   19 May 2017 5:37 AM GMT
అప్పుడు డీమానిటైజేషన్..ఇప్పుడు బాహుబలి-2
X
పోయినేడాది చివర్లో డీమానిటైజేషన్ దెబ్బకు సినిమాలు ఎలా అల్లాడాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిట్టవ్వాల్సిన కొన్ని సినిమాలు సైతం యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకున్నాయి. యావరేజ్ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఐతే అలాంటి సమయంలోనూ అదిరిపోయే వసూళ్లతో ఆశ్చర్యపరిచింది నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. కంటెంట్ బలంగా ఉన్న సినిమాను ఏదీ ఏమీ చేయలేదనడానికి రుజువు ఆ చిత్రం. అప్పుడు డీమానిటైజేషన్ దెబ్బను తట్టుకుని ఆ సినిమా నిలబడితే.. ఇప్పుడు ‘బాహుబలి-2’ ప్రభంజనం మధ్య నిఖిల్ కొత్త సినిమా ‘కేశవ’ తన ఉనికిని చాటుకోవాల్సి ఉంది.

‘బాహుబలి-2’ తర్వాత రెండు వారాంతాల్లో వచ్చిన తెలుగు సినిమాలేవీ కూడా నిలబడలేదు. తెలుగు సినిమాలనే కాదు.. వేరే భాషల్లో కూడా కొత్త సినిమాలు ‘బాహుబలి-2’ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో ‘కేశవ’ ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి-2’ జోరు కొనసాగుతున్నప్పటికీ ‘కేశవ’ మీద హైప్ అయితే బాగానే వచ్చింది. టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జనాలు. ఈ హైప్ వల్లే ‘బాహుబలి-2’ జోరు ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకు పెద్ద ఎత్తునే థియేటర్లు ఇచ్చారు. ఓ దశలో ‘బాహుబలి-2’కు భయపడి తమ సినిమాను ఇంకో వారం రెండు వారాలు వాయిదా వేద్దామని అనుకున్నామని.. కానీ డిస్ట్రిబ్యూటర్లే సినిమా చూసి ధైర్యం చేశారని.. నిర్మాత కూడా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడని నిఖిల్ చెప్పడం విశేషం. మరి వీళ్ల ధైర్యానికి తగ్గ ఫలితాన్ని ‘కేశవ’ ఇస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/