Begin typing your search above and press return to search.

విడుదలకు ముందే ఆన్ లైన్ లో సినిమా

By:  Tupaki Desk   |   11 Aug 2015 9:46 AM GMT
విడుదలకు ముందే ఆన్ లైన్ లో సినిమా
X
ఆ మధ్య ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే నెట్ లో లీకై పవన్ కళ్యాణ్ సహా అందరినీ ఆవేదనకు గురి చేసింది. ఐతే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టి సినిమాను విడుదల చేసేశారు. పైరసీని అడ్డుకున్నారు. దీంతో సినిమా మీద పెద్దగా ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడో బాలీవుడ్ సినిమా విషయంలోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇటీవలే సెన్సార్ కూడా చేయించారు. ఆ సందర్భంగానే సినిమాను సెన్సార్ సభ్యులెవరైనా కాపీ చేసి ఉంటారా అని సందేహం కలుగుతోంది.

ఆగస్టు 9వ తేదీ రాత్రి ఈ సినిమా ఆన్ లైన్ లో లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాంఝీ ఓ మంచి సినిమా. ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కింది. బీహార్ కు చెందిన మాంఝీ అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా రూపొందించారు. మాంఝీ ఓ కొండ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడికి సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో మరణించింది. వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై ఆమె చనిపోయింది. తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఇలాంటి స్ఫూర్తిదాయక నిజజీవిత కథతో తెరకెక్కిన సినిమాను పైరసీతో చంపేయడం ఘోరాతి ఘోరం. ఇంతకుముందు మలయాళ సినిమా ‘ప్రేమమ్’ను కూడా సెన్సార్ సభ్యులే పైరసీ చేయడం సంచలనం రేపింది. ఇలా ప్రభుత్వ అధికారులే ఇలాంటి ఘోరానికి పాల్పడితే ఇక సినిమాను కాపాడేదెవరు?