Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ వీరగ్రంథం.. అక్కడ కూడా బ్రేకే

By:  Tupaki Desk   |   14 Nov 2017 12:34 PM GMT
లక్ష్మీస్ వీరగ్రంథం.. అక్కడ కూడా బ్రేకే
X
ఏ ముహూర్తాన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను మొదలుపెట్టాడో కానీ.. ఇది నిత్యం ఏదో ఒక నెగెటివ్ న్యూస్ తోనే వార్తల్లో ఉంటోంది. ఈ చిత్ర షూటింగ్ రెండు రోజుల కిందటే హైదరాబాద్ మొదలుపెట్టే ప్రయత్నం చేశాడు జగదీశ్వర్ రెడ్డి. కానీ ఎన్టీఆర్ సమాధి దగ్గర షూటింగ్ చేయబోతే పోలీసులు అడ్డం పడ్డారు. అక్కడ షూటింగుకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. సినిమా పేరేంటో చెప్పకుండా అనుమతి తీసుకుని.. అక్రమంగా ఎన్టీఆర్ సినిమాను ఇక్కడ చిత్రీకరిస్తున్నారంటూ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి అక్కడ పెద్ద గొడవే చేశాడు. ఈ సినిమాకు ఈ రూపంలో ఫ్రీ పబ్లిసిటీ లభించింది.

రెండు రోజులు గడిచేసరికి మళ్లీ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ షూటింగుకి బ్రేక్ అంటూ మళ్లీ ఇంకో వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సొంత ఊరైన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో షూట్ చేద్దామని వెళ్తే ఆ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా తీయడానికి వీల్లేదని.. దీని వల్ల అటు ఎన్టీఆర్ కు.. ఇటు తమ గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. కేతిరెడ్డితో పాటు ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగా అడిగినా నిమ్మకూరు గ్రామస్థులు షూటింగుకి అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఆ గ్రామంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి కేతిరెడ్డి బృందం వెనుదిరిగింది. మరి వెళ్లిన చోటల్లా షూటింగుకి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేతిరెడ్డి అండ్ టీం ఏం చేస్తుందో చూడాలి.