Begin typing your search above and press return to search.

కేటుగాడు మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   18 Sep 2015 2:57 PM GMT
కేటుగాడు మూవీ రివ్యూ
X
చిత్రం: కేటుగాడు

తాగాణం: తేజస్‌- చాందినీ చౌదరి- రాజీవ్‌ కనకాల- అజయ్‌- సప్తగిరి- సుమన్‌- పృథ్వీ- స్నిగ్ధ- రఘు- ఫిష్‌ వెంకట్‌- ప్రవీణ్‌ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: మలహర్బత్ జోషి
నిర్మాత: వెంకటేష్‌ బలసాల
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కిట్టు నల్లూరి

ఈ మధ్య మాస్‌ ఆడియన్స్‌ ను థియేటర్లకు రప్పించడానికి చాలా మంది అప్‌ కమింగ్‌ హీరోలు కూడా మాస్‌ టైటిల్స్‌ ను ఎంచుకుంటున్నారు. టైటిల్‌ చూడగానే యూత్‌ ని చాలా సులభంగా ఆకర్షించొచ్చనేది వీరి ఆలోచనై వుండొచ్చు. దాంతో అవేమో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వుండటం లేదు. దాంతో ఎంత మంచి టైటిల్‌ ను పెట్టినా... బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఇలాంటి ప్రయత్నమే కేటుగాడు విషయంలో జరిగింది. తేజస్‌.. గతంలో ప్రకాష్‌ రాజ్‌ 'ఉలవచారు బిర్యానీ'లో నటించాడు. అలాంటి హీరోను పట్టుకొని 'కేటుగాడు' అనే టైటిల్‌ తో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కేటుగాడు ఎలాంటి కేటు పనులు చేసి ఆడియన్స్‌ ని అలరించాడో చూద్దామా?

కథ:

చందు(తేజస్‌) ఓ కార్ల దొంగ. కనిపించిన కార్లన్నింటినీ కొట్టేసి తన స్నేహితుడు ప్రవీణ్‌ సహాయంతో అమ్మేస్తుంటాడు. అలా ఓ బెంజ్‌ కారును కొట్టేసి తీసుకెళతాడు. అయితే ఆ కారు డిక్కీలో అఖిర(చాందినీ చౌదరి) అనే అమ్మాయి వుంటుంది. ఆమెను ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి ఆమె కారులోనే తీసుకెళుతూ వుంటాడు. దాన్ని ఓ డాబాలో చందు కొట్టేస్తాడు. కట్‌ చేస్తే.. టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌... ఈ ఫొటోలో వున్న అబ్బాయి.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రకాష్‌(రాజీవ్‌ కనకాల) చెల్లెల్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. అతని ఆచూచికి తెలిపిన వారికి రూ.50లక్షల బహుమతి ఇస్తాం అని ప్రకట. దాంతో కంగుతిన్న చందు... ఈ కిడ్నాప్‌ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను కేవలం కార్లను దొంగతనం చేసి అమ్ముతుంటాను. అంతే నాకు తెలుసు. ఈ గొడవంతా మీ అన్నకు చెబుదాం అని అఖిర చేత ఫోన్‌ చేయిస్తాడు. అయితే అఖిర అన్న ప్రకాష్‌ తానే తన చెల్లెల్ని కిడ్నాప్‌ చేయించానని చెప్పడంతో అఖిర, ఆమెతోపాటు చందు ఆశ్చర్యానికి గురవుతారు? అసలు అఖిర అన్న ప్రకాష్‌.. తన చెల్లెల్ను ఎందుకు కిడ్నాప్‌ చేయించాలనుకున్నాడనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే!!

కథనం - విశ్లేషణ:

ఓ కిడ్నాప్‌ స్టోరీని ఎంచుకుని.. కిడ్నాప్‌ కి కారణాలేంటనే సస్పెన్స్‌ ను తెరమీద చూపించాలనుకున్నప్పుడు ప్రేక్షకులు అనుక్షణం థ్రిల్‌ గురయ్యే స్క్రీన్‌ ప్లే రాసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. సాధారణంగా కిడ్నాప్‌ స్టోరీలంటే.. ఎక్కువగా ప్రయాణం చేస్తూ వుంటాయి. ఒక చోట నుంచి మరో చోటకు.. అటు నుంచి అడవుల్లోకి వెళ్లడం.. అక్కడ హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం.. అక్కడ సెలయేర్ల పక్కన డ్యూయెట్లు పాడుకోవడం.. ఆ తరువాత ఎవరైనా తరుముకొస్తే అడవిలో పరుగెత్తడం.. చెట్ల పొదల్లో దాక్కోవడం.. రౌడీల నుంచి తప్పించుకోవడం.. చివరకు విలన్ లకు దొరికి చావు దెబ్బలు తినడం.. ఇలాంటి సీన్ లు ఎన్ని సినిమాల్లో చూడలేదు. అలాంటి సీన్ లనే ఈ సినిమాలో దర్శకడు చూపించి విసుగు పుట్టించాడు. ఏమాత్రం వైవిధ్యం లేని కథ.. కథనంతో రెండు గంటలకు పైగా సినిమాను నడిపించి ప్రేక్షకులకు విసుగుతెప్పించాడు దర్శకుడు.

అసలు సినిమా బిగినింగ్‌ లోనే హీరో చేత ఓ రివాల్వర్‌ చేత పట్టించి.. తన మిత్రుణ్ని అతనితో పాటు రౌడీలను తరుముకొచ్చే సీను చూపించి.. అబ్బో ఇదేదో మంచి యాక్షన్‌ సినిమాలా వుందే అనే బిల్డప్ ఇచ్చాడు. అయితే ఇందులో యాక్షన్‌ సీన్స్‌ కాదుకదా... కనీసం మాస్‌ కు కిక్కెక్కే మాసలా సీన్ లు కూడా లేవు. దాంతో సినిమా మొత్తం బోరింగ్‌ అనిపిస్తుంది. ఇందులో హీరో అస్తమాను కార్లను దొంగతనం చేస్తుంటాడు. చిన్న కారు మొదలుకొని బెంజి కారు దాకా అన్నింటినీ అవలీలగా డోర్ లు ఓపెన్‌ చేసేసి డూప్లికేట్‌ తాళాల సహాయంతో ఎత్తుకెళిపోతుంటాడు. బ్రాండెడ్‌ కార్లను కూడా అల్టో కారులా అంత అవలీగా ఎత్తుకెళ్లొచ్చా అనే విధంగా ఇందులో చూపించాడు. పోనీ కార్లను హీరోనే ఎత్తుకెళుతున్నాడే అనుకుందాం. అతను ఎందుకు ఎత్తుకెళుతున్నాడో అనేదైనా చూపించాల్సింది. హీరోకు ఓ లక్ష్యం అంటూ లేకుండా కార్లను దొంగతనం చేస్తుంటాడు. మరి వచ్చిన డబ్బుతో ఏమైనా జల్సాలు చేస్తుంటాడా? అంటే దాన్ని కూడా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. దాంతో హీరో క్యారెక్టర్‌ కేవలం దొంగగానే మిగిలిపోయింది.

అఖిరను కిడ్నాప్‌ చేశాడని చందును పోలీసులు తరిమే సీను... ఓ అరగంటకు పైగా నడిపి ఆడియన్స్‌ బుర్రలు బద్దలయ్యేలా చేశాడు. కేవలం సినిమాను ముందుకు నడిపించడం కోసమే ఆ ఎపిసోడ్‌ ను అంతగా సాగతీశాడనిపిస్తుంది. ఆ తరువాత వచ్చే సీన్లయినా బాగున్నాయా అంటే ఎంత మాత్రం ఆకట్టుకోవు. కమెడియన్‌ సప్తగిరితో సినిమాను లాంగించేద్దామనుకునే ఐడియా ఐతే బాగుంది కానీ... అతనికి స్నిగ్ధతో కనెక్షన్‌ పెట్టడంతో వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్ లు మరి చెత్తగా అనిపిస్తాయి. వీరిద్దరి మధ్య తెరకెక్కించిన శోభనం సీను కామెడీ వర్కవుట్‌ కాలేదు. అలాగే సప్తగిరి - అజయ్‌ ల మధ్య వచ్చే కొన్ని సీన్ లు కూడా అంతగా కనెక్ట్‌ కావు. తుపాకీతో అస్తమాను కాల్చేస్తా.. కాల్చేస్తా అనే ఎపిసోడ్‌ మొత్తం బోరింగ్‌.

అయితే అఖిరను ఎందుకు తన అన్ననే కిడ్నాప్‌ చేయించడానికి ఒడిగట్టాడనేదాన్ని చివర్లో రివీల్‌ చేయడం బాగుంది. అప్పటి వరకు సస్పెన్స్‌ ను బాగానే మెయింటైన్‌ చేశాడు. సినిమాను ప్రథమ, ద్వితీయార్థంలో బాగా ట్రిమ్‌ చేసి.. చాలా గ్రిప్పింగ్‌ గా బిగి వుండేలా ఎడిటింగ్‌ చేసుంటే.. సినిమా ఓ మోస్తారుగా యూత్‌ ను మెప్పించేదే. పాటలు అవసరం లేకున్నా.. ఐదు పాటలను ఇరికించేశారు. అవేమైనా సినిమాకు అదనపు హంగులు తెచ్చి పెట్టాయా అంటే అదేమీ లేదు. పైగా ఓ ఐటెం సాంగును కూడా చూపించేశారు. ఇలాంటి వాటిన్నింటికి ఖర్చు తప్పించి సినిమాకు వచ్చిన లాభమేమీ లేదు. వాటిని ట్రిమ్‌ చేస్తే.. దర్శకుడికి కొంత మంచి పేరు వచ్చేది.

నటీనటులు:

ఈ మధ్య చాలా మంది కొత్త కుర్రాళ్లు తెలుగులో ట్రై చేస్తున్నారు. ఏదో ఒక నిర్మాత వారిని ప్రమోట్‌ చేయడానికి బాగానే ఖర్చు పెడుతున్నారు. ఇందులో తేజస్‌ అదృష్ట వంతుడే. అతన్ని పెట్టి సినిమాను తెరకెక్కించడం నిజంగా సాహసమే. అయితే తేజస్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చూడటానికి ఇటీవల వచ్చిన ప్రిన్స్‌, నందులా బాగానే హైటున్నా.. పర్‌ ఫార్మెన్స్‌ మాత్రం చూపలేకపోయాడు. చాందినీ చౌదరి కూడా అంతే. ఎలాంటి నటన ఆమె నుంచి ఆశించలేం. ఇందులో ఏదైనా చెప్పుకోవాలంటే సప్తగిరి గురించి చెప్పుకోవాలి. సినిమాకు వచ్చిన ఆడియన్స్ ను అంతో ఇంతో తన కామెడీ తో నవ్వించాడు. సప్తగిరి పలికే సంభాషణలు బాగున్నాయి. అలాగే ప్రవీణ్ కూడా బాగా చేశాడు. రాజీవ్‌ కనకాల, అజయ్‌ తన పరిధి మేరకు నటించారు. సుమన్‌ - ప్రవీణ్‌ - పృథ్వీ - జబర్దస్థ్‌ రఘు - ఫిష్‌ వెంకట్‌ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు ఎంచుకున్న కథనం రొటీన్‌. పోనీ ఆ రొటీన్‌ కథకు ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ ప్లే అయినా రాసుకున్నాడా అదీ లేదు. దాంతో సినిమా ఎమాత్రం ఇంట్రెస్ట్‌ ను కలిగించదు. ఎడిటర్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాను ముందుకు నడిపించడానికి సాగతీసిన ఎపిసోడ్ లను.. ట్రిమ్‌ చేయకుండా వదిలేసినందుకు అతన్ని కచ్చితంగా నిందించాల్సిందే. సాయికార్తీక్‌ అందించిన మ్యూజిక్‌ చాలా పూర్‌. నేపథ్య సంగీతం సంగతి అటుంచితే.. కనీసం పాటలైనా బాగున్నాయా అంటే అదీ లేదు. చెప్పుకోవడానికి ఒక్క పాట కూడా లేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇచ్చిన లొకేషన్లను బాగానే చూపించాడు. నిర్మాత కూడా తనకున్న లిమిట్స్‌ మేరకు ఖర్చు చేశాడు.

చివరగా... కేటుగాడు.. టైం పాస్* ఓ కిడ్నాప్‌ స్టోరీ

*conditions apply !


రేటింగ్: 2/5

#Ketugadu, #Ketugadumovie, #Ketugadurating, #Ketugadureview, #ketugaduTalk

Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre