Begin typing your search above and press return to search.

కార్మికుల వేత‌నాల‌పై కీల‌క భేటి..నిర్మాతల‌ మాటేంటీ?

By:  Tupaki Desk   |   24 Jun 2022 6:30 AM GMT
కార్మికుల వేత‌నాల‌పై కీల‌క భేటి..నిర్మాతల‌ మాటేంటీ?
X
క‌నీస వేత‌నాలు పెంచాలంటూ బుధ‌వారం సినీ కార్మికులు మెరుపు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో చాలా వ‌ర‌కు సినిమాల షూటింగ్ లు అర్థ్రాంత‌రంగా నిలిచిపోయాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వ‌ర‌కు దాదాపు 28 చిత్రాల నిర్మాణం నిలిచిపోయిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి.

గ‌త కొంత కాలంగా ఛాంబ‌ర్ కు ఫెడ‌రేష‌న్ కు మ‌ధ్య కార్మికుల క‌నీస వేత‌నాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతూనే వున్నాయి. అయితే వాటిని ఛాంబ‌ర్ ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే తాము మెరుపు స‌మ్మెకు దిగామ‌ని కార్మికుల త‌రుపున ఫెడ‌రేషన్ తెలిపింది.

మాకు ముంద‌స్తుగా స‌మ్మె విష‌యం తెల‌ప‌కుండానే కార్మికులు షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చార‌ని, ఇది స‌మంజ‌సం కాద‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది. సి. క‌ల్యాణ్ లాంటి నిర్మాత‌లు కార్మికుల క‌నీస వేత‌నాలు పెంచ‌డానికి తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ఈ వివాదంపై స్పందించ‌డంతో ఫిల్మ్ ఛాంబ‌ర్ - ఫెడ‌రేష‌న్ స‌భ్యులు మ‌రో సారి కార్మికుల వేత‌నాల పై చ‌ర్చ‌లో పాల్గొన్నారు.

చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో కార్మికులు గురువారం స‌మ్మెను విరమించారు. శుక్ర‌వారం నుంచి పెరిగిన వేత‌నాల‌తో వ‌ర్క్ చేస్తామంటూ ప్ర‌క‌టించారు. కో ఆర్డినేష‌న్ కమిటీ నిర్ణ‌యం మేర‌కు వేత‌నాల‌ని ఛాంబ‌ర్‌, ఫెడ‌రేష‌న్ ద్వారా అంద‌జేస్తామ‌ని సి. క‌ల్యాణ్ వెల్ల‌డించారు. అంతే కాకుండా శుక్ర‌వారం స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అధ్య‌క్ష‌త‌న ఫెడ‌రేష‌న్‌, ఛాంబ‌ర్ లు ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతాయ‌ని తెలిపారు. నేడు దిల్ రాజు అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌రుగుతోంది.

ఈ స‌మావేశంలో కార్మికుల క‌నీస వేత‌నాలు ఏ మేర‌కు పెంచాలి? అనే దానిపైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజా వివాదంపై ఎవ‌రి వాద‌న‌లు వారికి వున్న నేప‌థ్యంలో కార్మికుల పంతం నెగ్గుతుందా? లేక నిర్మాత‌ల మాట నెగ్గుతుందా అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

గురువారం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ చొర‌వ‌తో ఛాంబ‌ర్ , ఫెడ‌రేష‌న్ స‌భ్యులు రెండు గంట‌ల పాటు చ‌ర్చించి ఆ త‌రువాత కార్మికుల స‌మ్మెని విర‌మింప‌జేశారు. ఫైన‌ల్ గా కార్మికుల క‌నీస వేత‌నాల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై మ‌రి కొన్ని గంట‌ల్లోనే కీల‌క విష‌యాలు బ‌య‌టికి రానున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.