Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో 'కేజీయఫ్ 2' సరికొత్త రికార్డ్..!

By:  Tupaki Desk   |   15 April 2022 11:30 AM GMT
బాలీవుడ్ లో కేజీయఫ్ 2 సరికొత్త రికార్డ్..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జక్కన్న నుంచి ఇటీవల వచ్చిన RRR సినిమా సైతం ఆ రికార్డులను బీట్ చేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే ఇప్పటికే ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో 'బాహుబలి: ది కంక్లూజన్' రికార్డులు పదిలంగా ఉన్నాయి.

అయితే లేటెస్టుగా వచ్చిన ''కేజీయఫ్: చాప్టర్ 2'' మూవీ ఫస్ట్ డే కొన్ని ఏరియాలలో బాహుబలి మరియు RRR లను అధిగమించింది. కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కేజీయఫ్ 1' సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే హిందీ వెర్షన్ మొదటి రోజు వసూళ్ళలో ఆల్ టైమ్ బాలీవుడ్ రికార్డ్‌ ను సెట్ చేసింది.

హిందీ మార్కెట్‌ లో "KGF 2" దాదాపు రూ. 53.95 కోట్లు వసూలు చేసింది. ఇంతకు ముందు బాలీవుడ్ చిత్రం 'వార్' 50.75 కోట్ల రికార్డుతో అగ్రస్థానంలో ఉండగా.. దాన్ని ఇప్పుడు డబ్బింగ్ మూవీ బీట్ చేసింది. అంతేకాదు 'కేజీఎఫ్ 1' లైఫ్ టైం కలెక్షన్స్ ను (44.09 కోట్లు) ఒక్క రోజులో అధిగమించింది.

మరోవైపు RRR మూవీ హిందీలో తొలి రోజు 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇప్పుడు 'KGF 2' నార్త్ సర్క్యూట్స్ లో ట్రిపుల్ ఆర్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని కలెక్ట్ చేసింది. 'జెర్సీ' సినిమా బరిలో నుంచి తప్పుకోవడం.. అధిక టికెట్ ధరలు 'కేజీఎఫ్-2' కు కలిసొచ్చాయని చెప్పవచ్చు.

తమిళనాడులో సైతం ఆర్.ఆర్.ఆర్ కంటే యష్ సినిమా ఎక్కువ కలెక్షన్లను అందుకుంది. ఎటువంటి పోటీ లేని సమయంలో RRR భారీ స్థాయిలో విడుదలైంది. కానీ ఇప్పుడు 'KGF: చాప్టర్ 2' కు 'బీస్ట్' తో పోటీ ఉన్నప్పటికీ ఎక్కువ వసూళ్ళు రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కేరళలో ఓపెనింగ్ డే నాడు మోహన్‌ లాల్ నటించిన 'ఒడియన్' రికార్డ్ బ్రేక్ చేసి 'కెజిఎఫ్-2' ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. కానీ రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు - ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు భాగమైన 'RRR' మూవీ అక్కడ రికార్డుల వేటకు చాలా దూరంలో ఉండిపోయింది.

అయితే ఓవరాల్ గా లాంగ్ రన్ లో 'కేజీఎఫ్ 2' సినిమా 'బాహుబలి 2' కాదు కదా.. RRR వసూళ్ల రికార్డులను కూడా బీట్ చేసే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కన్నడ డబ్బింగ్ సినిమాలు తొలి రోజే మిశ్రమ స్పందన వచ్చింది. ఎలివేషన్స్ తప్ప ఎమోషన్స్ కనెక్ట్ అవలేదని కామెంట్స్ వచ్చాయి.

'కేజీఎఫ్ 1' సినిమా సక్సెస్ తో రెండో భాగంపై భారీ హైప్ ఏర్పడటం.. పెరిగిన టికెట్ల ధరలు.. పెరిగిన స్క్రీన్లు మరియు షోల వల్ల ఫస్ట్ డే 'కేజీఎఫ్: చాప్టర్ 2' కు ఆ స్థాయి వసూళ్ళు రావడానికి కారణమైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మూడు వారాల్లో 1000 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. మరి రాబోయే రోజుల్లో 'KGF 2' ఏ మేరకు వసూళ్ళు రాబడుతుందో చూడాలి.