Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2': అదిరిపోయే ఐటమ్ లో మెరిసిపోయే భామ ఎవరో!

By:  Tupaki Desk   |   3 Jan 2022 2:30 PM GMT
కేజీఎఫ్ 2: అదిరిపోయే ఐటమ్ లో మెరిసిపోయే భామ ఎవరో!
X
యశ్ హీరోగా కన్నడలో రూపొందిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. సరైన కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను దడదడలాడించవచ్చని నిరూపించిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ .. హీరోగా యశ్ తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. 'కేజీఎఫ్' వసూళ్ల వర్షాన్ని కురిపించడం .. సీక్వెల్స్ ను వరుసగా చేస్తూ వెళ్లే మూలకథ ఉండటం వలన మళ్లీ రంగంలోకి దిగేసి 'కేజీఎఫ్ 2'ను రూపొందించారు. ఈ వేసవిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ను రీ మిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 'షోలే' సినిమాలోని 'మెహబూబా మెహబూబా' అనే సాంగుని రీమిక్స్ చేసినట్టుగా చెబుతున్నారు. అమితాబ్ .. ధర్మేంద్ర .. సంజయ్ కపూర్ .. హేమమాలిని .. అంజాద్ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషిచిన ఆ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి ఆర్డీ బర్మన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా ఆ సినిమాలో నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన 'మెహబూబా మెహబూబా' అనే ఐటమ్ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

అంజాద్ ఖాన్ ఇలాకాలో హెలెన్ బృందంపై చిత్రీకరించిన ఈ పాట, జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అలాంటి పాటను 'కేజీఎఫ్ 2' కోసం రీమిక్స్ చేశారని అంటున్నారు. అప్పట్లో యూత్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సాంగు రీమిక్స్ ను ఈ సినిమాలో హీరోయిన్ పై చిత్రీకరించరేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్డీ బర్మన్ స్వరపరిచిన సాంగ్ ను టచ్ చేయడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. పైగా అది బాగా పాప్యులర్ అయిన పాట. మరి 'కేజీఎఫ్ 2'కి సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ఈ విషయంలో ఎంతవరకూ సక్సెస్ అవుతాడనేది చూడాలి.

యశ్ .. సంజయ్ దత్ .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీనిధి శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సంజయ్ దత్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాడు. ఆయన రాకతో ఈ సినిమా భారీతనం మరింత పెరిగిందని అంటున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించనున్న అత్యంత భారీ చిత్రాలలో .. అత్యంత భారీ అంచనాలు కలిగిన చిత్రాలలో 'కేజీఎఫ్ 2' కూడా ఉంది. మరి ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది చూడాలి.