Begin typing your search above and press return to search.

KGF 2 VS బీస్ట్! ఇంత‌కీ ఏ ఏరియాల్లో?

By:  Tupaki Desk   |   10 April 2022 5:30 AM GMT
KGF 2 VS బీస్ట్! ఇంత‌కీ ఏ ఏరియాల్లో?
X
వ‌రుసగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి భారీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తుండటంతో అభిమానుల్లో వీటిపై భారీ అంచనాలున్నాయి. బ‌డ్జెట్ల ప‌రంగా బ‌య్య‌ర్ల ప‌రంగానూ ఆయా చిత్రాల‌పై భారీ బెట్టింగ్ సాగింద‌ని అంచ‌నా. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాతా సౌత్ పరిశ్రమలో అరుదైన దృశ్యం క‌నిపిస్తోంది. ఈ ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద స్పెషల్ ఎవ‌రు? అన్న‌దానిపైనా వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

త‌మిళం నుంచి మోస్ట్ అవైటెడ్ బీస్ట్ - క‌న్న‌డం నుంచి KGF చాప్టర్ 2 .. క్లాష్ అవుతుండ‌డంపై చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు సినిమాలు నువ్వా నేనా? అంటూ ఆక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డనున్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న విడుద‌ల‌వుతుంటే.. కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న వ‌స్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ ని షేర్ చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అయితే ప్ర‌ధానంగా పోటీ ఏఏ ఏరియాల్లో ఉంటుంది? అన్న‌ది విశ్లేషిస్తే.. ఇవ‌న్నీ పాన్-ఇండియన్ సినిమాలు కావ‌డంతో స్వ‌దేశంలో అలాగే విదేశాల్లోనూ పోటీ నెల‌కొంది. ప్ర‌తిచోటా ఇవి అత్యంత భారీగా రిలీజ్ కానున్నాయి. మాస్ ఎంటర్ టైనర్ లు కావ‌డంతో స్పెష‌ల్ ట్రీటిస్తాయ‌ని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద‌ళ‌పతి విజయ్ వ‌ర్సెస్ యష్ గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కేజీఎఫ్ 2.. బీస్ట్ చిత్రాలు మాస్ ట్రీటిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇవి పెద్ద బడ్జెట్ చిత్రాలు.. కావ‌డంతో బోలెడంత హైప్ నెల‌కొంది.

యష్ KGF చాప్టర్ 2 ప్రధానంగా కన్నడ చిత్రం అయినా హిందీ- తమిళం- తెలుగు - మలయాళం డబ్బింగ్ వెర్షన్లలో ఏప్రిల్ 14న‌ విడుదల కానుంది. సీక్వెల్ మూవీ హిందీ - తెలుగు వెర్షన్ ల‌లోనూ రికార్డు స్థాయిలో విడుద‌ల కానుంది. అందుకే ఇది ఖచ్చితంగా పాన్-ఇండియన్ చిత్రం. కేజీఎఫ్ మొద‌టి భాగం కంటే పార్ట్ 2 అత్యంత భారీగా తెర‌కెక్కింది. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందించార‌ని టాక్ ఉంది. ఏప్రిల్ 13న విడుద‌ల‌వుతున్న బీస్ట్ ఈ చిత్రానికి ఇంచుమించు అంతే బ‌డ్జెట్ పెట్టారు. ఈ సినిమా దేశ విదేశాల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.

అయితే మూడు మార్కెట్ల‌లో ఈ రెండు సినిమాల న‌డుమ పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని అంచ‌నా. తెలుగు- త‌మిళం తో పాటు అమెరికా స‌హా విదేశీ మార్కెట్ల‌లో ఈ రెండు సినిమాల న‌డుమ క్లాష్ ప్ర‌ధానంగా ఉండ‌నుంది. ఒక రోజు తేడాతోనే విడుద‌ల‌వుతున్నాయి కాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌సూళ్ల పరంగా షేర్ చేసుకోవాల్సిన స‌న్నివేశం ఉంది.

క్లాష్ వ‌ల్ల ఓపెనింగులు స్వ‌ల్పంగా త‌గ్గేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక హిందీ బెల్ట్ లో బీస్ట్ కంటే కేజీఎఫ్ 2 కి భారీ క్రేజ్ ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రేస్ లో అస‌లైన విన్న‌ర్ ఎవ‌రో తేలాలంటే మ‌రో నాలుగు రోజులే స‌మ‌యం మిగిలి ఉంది. ఈ రెండు చిత్రాల‌తో పాటు హిందీ నుంచి జెర్సీ కూడా విడుద‌ల‌వుతోంది. అలాగే నెలాఖ‌రున చిరు-చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య కూడా విడుద‌ల కానుంది.