Begin typing your search above and press return to search.

ఆగని కేజీఎఫ్ సంచలనాలు

By:  Tupaki Desk   |   26 Dec 2018 2:30 PM GMT
ఆగని కేజీఎఫ్ సంచలనాలు
X
ఒక కన్నడ సినిమా తెలుగులో రిలీజవ్వడమే అరుదైన విషయం. గతంలో ఏవో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిని మన జనాలు పట్టించుకున్నది లేదు. కానీ ఇప్పుడు ఓ కన్నడ చిత్రం తెలుగులో మంచి అంచనాల మధ్య రిలీజవ్వడమే కాదు.. ఆ అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. ఆ చిత్రమే.. కేజీఎఫ్. ముందు నుంచి ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేయడం వల్ల రిలీజ్ టైంలో కొంచెం బజ్ వచ్చింది. ఐతే ‘పడి పడి లేచె మనసు’.. ‘అంతరిక్షం’ లాంటి క్రేజీ సినిమాలకు పోటీగా వస్తున్న ఈ చిత్రం.. వాటిని దాటి తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకర్షిస్తుందో అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాలు డివైడ్ టాక్‌ తో తొలి వారాంతంలోనే వీక్ అయిపోగా.. ‘కేజీఎఫ్’ మాత్రం అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. దీనికి కూడా గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ వసూళ్లు మాత్రం ఆశ్చర్యకర రీతిలో ఉన్నాయి.

వీక్ డేస్‌ లో సైతం ‘కేజీఎఫ్’కు హౌస్ ఫుల్స్ పడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మిగతా రెండు తెలుగు సినిమాలకు వీకెండ్లోనే హాళ్లు నిండలేదు. కానీ ఈ చిత్రం సోమ.. మంగళ వారాల్లో సైతం హౌస్ ఫుల్ వసూళ్లతో నడుస్తోంది. క్రిస్మస్ సెలవు కావడంతో మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘కేజీఎఫ్’కు మూడు షోలు ఫుల్ కావడం విశేషం. ‘అంతరిక్షం’.. ‘పడి పడి’ సినిమాలకు ఆక్యుపెన్సీ సగమే ఉండగా.. దీనికి ఇలా ఫుల్స్ పడ్డాయి. ముందు వారం రిలీజైన మరో చిన్న సినిమా ‘హుషారు’కు సైతం మంచి వసూళ్లు వస్తున్నాయి. దానికి కూడా రెండో వారం హౌస్ ఫుల్స్ పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఓ కన్నడ సినిమా ఇలాంటి వసూళ్లు రాబట్టడమే మన ట్రేడ్ పండిట్లకు అర్థం కాని విషయం. ఇప్పటికే తెలుగులో ఈ చిత్ర షేర్ రూ.3.5 కోట్ల దాకా ఉండటం విశేషం. ఫుల్ రన్లో రూ.5 కోట్ల మార్కును దాటొచ్చు. ఓ కన్నడ చిత్రానికి ఇక్కడ ఇది చాలా పెద్ద మొత్తమే. మరోవైపు హిందీలో సైతం ఈ చిత్రం అదరగొడుతోంది.