Begin typing your search above and press return to search.

'ఖిలాడి' ట్రైలర్: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్..!

By:  Tupaki Desk   |   7 Feb 2022 1:08 PM GMT
ఖిలాడి ట్రైలర్: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్..!
X
మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఖిలాడీ''. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న తెలుగు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'U/A' (యూ/ఏ) సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

రవితేజ మార్క్ డైలాగ్స్ - హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ - ఛేజింగ్ సన్నివేశాలు - స్టైలిష్ షాట్స్ తో కూడిన 'ఖిలాడీ' చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో మాస్ రాజా డ్యూయెల్ రోల్ లో కనిపిస్తున్నారు. మోహన్ గాంధీ అనే ఒక పాత్ర ఫన్నీ గోయింగ్ గా ఉండగా.. మరొక రోల్ డబ్బే ప్రధానంగా మోస్ట్ వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లినట్లు కనిపిస్తోంది. అలానే కొన్ని వందల కోట్ల అక్రమ డబ్బు గురించి ఫోలీసాఫీసర్ అర్జున్ ఇన్వెస్టిగేట్ చేస్తుండటాన్ని బట్టి చూస్తే.. ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగా రవితేజ ఏదో స్కామ్ చేసినట్లు తెలుస్తోంది.

ఓ పాపని ప్రధానంగా చూపిస్తూ.. రెండు పాత్రలకు సంబంధించిన కనెక్షన్ ఏంటనేది సస్పెన్స్ గా ఉంచారు. రవితేజ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉండటమే కాదు.. ఇంతకముందు చేయని సరికొత్త క్యారెక్టర్ లో కనిపిస్తున్నారని అర్థం అవుతుంది. ఇందులో హీరోయిన్లుగా నటించిన మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి.. అందంగా కనిపించారు. మాస్ మహారాజా వారితో రొమాన్స్ చేయడమే కాదు.. లిప్ లాక్ కిస్సింగ్ తో ఆశ్చర్యపరిచారు. ఉన్ని ముకుందన్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ - నికితిన్ ధీర్ - ఠాకూర్ అనూప్ సింగ్ - సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అలానే సినిమాటోగ్రాఫర్స్ సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించినట్లు ఈ యాక్షన్ పాకెడ్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. దీనికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమర్ రెడ్డి ఎడిటర్ గా వర్క్ చేసారు. రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు.. ఈ ఆటలో ఒక్కడే కింగ్' 'మెటల్ డిక్టేటర్ లాగా ఇక్కడ మనీ డిక్టేటర్ ఉంటది' వంటి డైలాగ్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాంత్ విస్సా మరియు దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కలసి ఈ సినిమాలో డైలాగ్స్ రాసారు. 'ఖిలాడీ' చిత్రాన్ని జయంతీలాల్‌ గడ (పెన్ స్టూడియోస్‌) సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ - ఎ స్టూడియోస్‌ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'క్రాక్' హిట్ తో జోష్ లో ఉన్న రవితేజకు.. ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.