Begin typing your search above and press return to search.

చక్కనమ్మ చిక్కినా అందమే!

By:  Tupaki Desk   |   24 Sep 2021 6:32 AM GMT
చక్కనమ్మ చిక్కినా అందమే!
X
చక్కనమ్మ చిక్కినా అందమే .. అనే మాట పాత కాలంలో ఎక్కువగా వినిపించేది. ఇక ఇప్పుడు అందరూ జీరో సైజుల వెంట పరుగులు తీస్తున్నందు వలన, ఈ నానుడితో అంతగా పని లేకుండా పోయింది. కానీ ఆల్రెడీ కాస్త బొద్దుగా ఉన్నవాళ్లు .. అందునా సినిమా తారలు సన్నబడితే మాత్రం ఈ నానుడిని వాడుకోవలసి వస్తుంది. ఈ మాట ఇప్పుడు ఖుష్బూ కి వరిస్తుంది. ఎందుకంటే గుమ్మడి పువ్వులా నిండుగా కనిపించే ఆమె, కాడమల్లె పువ్వులా సన్నబడిపోయింది. ఏ రేంజ్ లో కసరత్తులు చేసిందో తెలియదుగానీ, ఈ వయసులో నాజూకుదనానికి నమూనాగా మారిపోయింది.

తాను చాలా సన్నబడ్డానని ఒక మాట చెప్పేసి .. ఒక ఫోటో పెట్టేసి ఆమె ఊరుకోలేదు. తన 18 ఏళ్ల వయసులో వాడిన జీన్స్ ప్యాంటును బయటికి తీసి .. ఐరన్ చేసి మరీ దానిని ధరించింది. ఆ ప్యాంటు ఇప్పుడు తనకి చాలా పెర్ఫెక్ట్ గా ఫిట్ అయిందంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. అంటే 50 ఏళ్ల వయసులో తాను 18 ఏళ్ల అమ్మాయిలా అదే ఫిట్ నెస్ తో ఉన్నాననే విషయాన్ని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోను ఒక్కసారిగా చూసినవాళ్లు ఖుష్బూనా? ఆమె కూతురా? అనే ఎక్స్ ప్రెషన్ మాత్రం ఇవ్వకుండా ఉండలేరు.

అంతగా ఖుష్బూ మారిపోయింది .. తన వయసుకి మాయ మాటలు చెప్పి, ఒక 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. ముద్దమందారం వంటి ఖుష్బూ, తన ఏజ్ గ్రూప్ సీనియర్ హీరోయిన్లు అసూయపడేలా ముద్దబంతిలా మారిపోయింది. తెరపై ఆమె కాంబినేషన్లో కనిపించడానికి ఇప్పటి హీరోయిన్లు కంగారుపడేలా మారిపోయింది. ఇంతటి అందగత్తెను అక్క పాత్రలకు తీసుకుంటామంటే హీరోలు ఒప్పుకుంటారా? అమ్మ పాత్రలు చేయిస్తామంటే కుర్ర హీరోయిన్లు అంగీకరిస్తారా? అని దర్శకులు డైలమాలో పడిపోయారు.

నిజంగానే ఖుష్బూ చాలా అందగత్తె .. అందాన్ని కాపాడుకోవడం తెలిసిన కథానాయిక. అప్పట్లో ఆమె తెలుగు ... తమిళ .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే .. అందుకు కారణం తమిళ సినిమాలతో బిజీగా ఉండటమే. తెలుగులో 'స్టాలిన్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత 'యమదొంగ' .. 'అజ్ఞాతవాసి' సినిమాల్లోను ముఖ్యమైన పాత్రలను చేసింది. ప్రస్తుతం ఆమె 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా చేస్తోంది. ఇక చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలోను ఒక కీలకమైన పాత్ర చేయనుందనే టాక్ వినిపిస్తోంది.