Begin typing your search above and press return to search.

రివ్యూ : కిక్ 2

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:54 PM GMT
రివ్యూ : కిక్ 2
X
కిక్-2 రివ్యూ
రేటింగ్ - 2.5/5
నటీనటులు - రవితేజ - రకుల్ ప్రీత్ సింగ్ - రవికిషన్ - కబీర్ ఖాన్ - బ్రహ్మానందం - తనికెళ్ల భరణి - పోసాని కృష్ణమురళి - అశిష్ విద్యార్థి - రాజ్ పల్ యాదవ్ - శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం - తమన్
ఛాయాగ్రహణం - మనోజ్ పరమహంస
నిర్మాత - కళ్యాణ్ రామ్
కథ, మాటలు - వక్కంతం వంశీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - సురేందర్ రెడ్డి

టాలీవుడ్ లో సీక్వెల్స్ అచ్చిరావనే సెంటిమెంటుంది. ఐతే రవితేజ, సురేందర్ రెడ్డి ఆ సెంటిమెంటును పట్టించుకోకుండా ఆరేళ్ల కిందట తమ కాంబినేషన్ లో సూపర్ హిట్టయిన ‘కిక్’ సినిమా సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్ క్రేజ్ కు తోడు హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం ఆసక్తి రేపింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ‘కిక్-2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా అంచనాల్ని అందుకుందా? ‘సీక్వెల్ సెంటిమెంటు’ని తిరగరాసిందా? చూద్దాం పదండి.

కథ:

‘కిక్’ కళ్యాణ్ దొంగతనాలు మానేసి పోలీసు ఉద్యోగంలో చేరాక.. అది బోర్ కొట్టేసి అమెరికాకు వెళ్లి సెటిలవుతాడు. అతడి కొడుకు రాబిన్ హుడ్ (రవితేజ) కళ్యాణ్ కంటే తేడాగా తయారవుతాడు. తండ్రి ఎదుటోళ్లను ఆనందంగా ఉంచడంలో కిక్కు వెతుక్కుంటే.. ఇతను తన కంఫర్టే అన్నింటికన్నా ముఖ్యం అనుకునే టైపు. తన తండ్రి ఆస్తిని ఎవరో రౌడీ కబ్జా చేశాడని తెలుసుకుని, దాన్ని దక్కించుకోవడానికి హైదరాబాద్ కు వచ్చిన రాబిన్.. ఓ రౌడీకి బుద్ధి చెబుతుండగా చూసిన ఓ వ్యక్తి నార్త్ ఇండియాలో ఠాకూర్ (రవికిషన్) అనే దాదా ధాటికి విలవిలలాడుతున్న తన గ్రామానికి రాబిన్ అవసరం ఉందని భావిస్తాడు. తన గ్రామానికి వెళ్లి అక్కడి జనాలకు రాబిన్ గురించి వివరిస్తాడు. ఆ గ్రామస్థులంతా కలిసి రాబిన్ ను తమ గ్రామానికి రప్పిస్తారు. మరి ఠాకూర్ మీదకు రాబిన్ ను ఆ గ్రామస్థులు ఎలా ఉసిగొల్పారు? రాబిన్ ఠాకూర్ కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని కథల్ని ఎంత ఫన్నీగా డీల్ చేసినా చెల్లిపోతుంది. అందుకు ‘రేసుగుర్రం’ ఓ ఉదాహరణ. ఓ ఆవారా కుర్రాడు హోం మంత్రిని గుప్పెట్లో పెట్టేసుకుని సడెన్ గా పోలీస్ అయిపోయి.. విలన్ని ఓ ఆటాడేసుకుంటే.. లాజిక్కుల గురించి పట్టించుకోకుండా.. ఏంటిది ఇంత సిల్లీగా ఉంది అనుకోకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఐతే ఆ కథ పర్మిట్ చేసింది కాబట్టి.. ఏం చేసినా చెల్లిపోయింది. అన్ని కథలూ ఒకేలా ఉండవు. అన్నింటినీ ఒకే తీరులో నడిపిస్తామంటే కుదరదు. ఎమోషనల్ గా నడిపించాల్సిన కథను కూడా ‘రేసుగుర్రం’ తరహాలోనే సిల్లీగా లాగిస్తామంటే ఎలా చెల్లుతుంది? గుండెను మెలిపెట్టేలా సాగాల్సిన సన్నివేశాల్నికూడా కామెడీగా మార్చేస్తే వాటితో ప్రేక్షకులు ఎలా కనెక్టవుతారు? కిక్-2తో వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఇదే.

విలన్- హీరోకి మధ్యశత్రుత్వాన్ని పెంచే సన్నివేశాలు... ప్రేక్షకుడు మనసుకు తాకవు. ఆ వైరం సినిమాటిక్ గా ఉంది. అక్కడ ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. ఎమోషన్ తేవడంలో వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి జోడీ ఫెయిలైంది. హీరోకు, విలన్ కు మధ్య ప్రత్యక్ష వైరం లేకుంటే ప్రేక్షకుడు ఆ కథతో కనెక్టవడని ‘ఊసరవెల్లి’ రుజువయినా... సేమ్ మిస్టేక్ రిపీటయ్యింది. మళ్లీ అలాంటి కథతోనే సాహసం చేశారు. అసలే హీరోకు, విలన్ కు ప్రత్యక్ష వైరం లేకపోగా.. 2 గంటల 40 నిమిషాల నిడివిలో తొలి రెండు గంటలు హీరో, విలన్ ఒకరికొకరు అసలు ఎదురే పడరు. రెండు గంటల తర్వాత కానీ వాళ్లిద్దరి మధ్య గొడవే మొదలవదు. అలాంటపుడు ప్రేక్షకుడికి ఏం ఎమోషన్ వస్తుంది?

పోనీ ఈ రెండు గంటల్లో విలన్ అరాచకాల్ని, గ్రామస్థుల బాధల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అంటే అదేం లేదు. ఆరంభంలో ఓ పది నిమిషాలు విలనే తన అరాచకాల గురించి చిన్న లెక్చర్ దంచుతాడు. ఆ ఊరికి అతడు చేసిన అన్యాయం ఇదీ అంటూ ఏదో ఫ్లాష్ బ్యాక్ చూపించినట్లు చూపించి వదిలేస్తారు. అంతే.. ఇక ఆ తర్వాతంతా ఆ ఊరివాళ్లు ఎక్కడో హైదరాబాద్ లో ఓ హీరో ఉన్నాడని నోటి మాటతో విని.. అతణ్ని రప్పించడానికి చేసే సిల్లీ ప్రయత్నాలతో.. అతనొచ్చాక విలన్ కు, అతడికి గొడవ పెట్టడానికి చేసే అర్థ రహితమైన ప్లాన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సాగుతుంది కిక్-2 కథనం.

కిక్ సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించింది ప్రధానంగా వినోదం. ఆ దారిలో నడిచినంత వరకు కిక్-2 బాగానే అనిపిస్తుంది. రొటీనే అయినా ప్రథమార్ధంలో వచ్చే రవితేజ-బ్రహ్మి కామెడీ బాగానే వర్కవుటైంది. ‘కిక్’ సినిమాలో ప్రేక్షకులకు బాగా కిక్కిచ్చింది హీరో క్యారెక్టరైజేషనే. సీక్వెల్ లో ‘కంఫర్ట్’ కాన్సెప్ట్ తో ఇంకో భిన్నమైన క్యారెక్టరైజేషన్ ట్రై చేశారు. ప్రథమార్ధం వరకు ఆ కాన్సెప్ట్ బాగానే వర్కవుటైంది. ఇంట్రడక్షన్ దగ్గర్నుంచి తొలి అరగంటలో హీరో క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాల్లో సురేందర్ ప్రతిభ చూపించాడు. తనను కారుతో గుద్దేసి వెళ్లిపోయిన రౌడీకి హీరో బుద్ధి చెప్పే ఎపిసోడ్ ‘కిక్-2’ డబుల్ కిక్ ఇస్తుందనే ఆశలు రేపుతుంది. ఆ తర్వాత రవితేజ-బ్రహ్మి కెమిస్ట్రీ వర్కవుటవడంతో రొటీన్ గానే అయినా నవ్వించేశారు. పోసాని-కోవై సరళ కామెడీ ఎపిసోడ్ అతిగా అనిపించినా.. ప్రథమార్ధం వరకు బండి బాగానే నడిచిపోతుంది.

ఐతే మూల కథతో సంబంధం లేనంతవరకు బాగా సాగిన కథనం.. ఎక్కడైతే కథలోకి అడుగుపెట్టిందో అక్కడి నుంచి గాడి తప్పింది. సగం సినిమా వరకు హీరో, విలన్ ఎదురుపడకపోవడమే చిత్రమంటే.. ద్వితీయార్ధంలో కూడా ఇద్దరికీ వైరం మొదలవడానికి దాదాపు గంట పడుతుంది. ఈ మధ్యలో హీరోకు, విలన్ కు గొడవ పెట్టడానికి గ్రామస్థులు చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. హీరో ఎంతసేపటికీ రంగంలోకి దిగకపోవడంతో ప్రేక్షకుడిలో ఫ్రస్టేషన్ కు గురవుతాడు. గ్రామానికి సంబంధించి సీరియస్ గా, ఎమోషనల్ సాగాల్సిన వ్యవహారాన్ని కామెడీ చేసి పారేశాడు సురేందర్. దీంతో ఎమోషన్ పండలేదు. చివరి అరగంటలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే హీరోయిజం బాగానే హైలైట్ అయ్యాయి కానీ.. అంతకుముందు సాగిన వ్యవహారమే గ్రాఫ్ ను చాలా కిందికి తీసుకెళ్లిపోయింది. ప్రథమార్ధంలో వినోదమైనా, ద్వితీయార్ధంలో యాక్షన్ అయినా కథలో ఇమడలేదు. అవి అదనపు ఆకర్షణలుగానే భావించాలి. కథాకథనాలతో అయితే ప్రేక్షకుడు ఏ దశలోనూ కనెక్టవడు.

నటీనటులు:

రవితేజ ఎనర్జీని దర్శకుడు వాడుకున్నంత సేపు అతను చెలరేగిపోయాడు. ఫస్టాఫ్ ను తన భుజాల మీద నడిపించాడు. తనదైన శైలిలో వినోదం పండించాడు. సెకండాఫ్ లో అతడి పాత్ర ప్యాసివ్ అయిపోయింది. చివరి అరగంటలో రవితేజ తనలోని మాస్ యాంగిల్ ను బయటికి తీశాడు. అతడి మాస్ హీరోయిజం అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఐతే రవితేజ ఎనర్జీ ఏమీ తగ్గలేదు కానీ.. అతడి లుక్ మాత్రం ఇబ్బందికరంగా ఉంది. వయసు మీద పడ్డ ప్రభావం స్పష్టంగా తెలిసిపోయింది. పైగా మనిషి చిక్కడంతో చాలా సన్నివేశాల్లో ఎబ్బెట్టుగా కనిపించాడు. రకుల్ ప్రీత్ బాగా చేసింది. క్యారెక్టర్ పేలవంగా ఉన్నప్పటికీ.. తన పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ కు ముందు ఎమోషనల్ సీన్ లో ఆమె నటన చూస్తే మంచి సన్నివేశాలు పడితే సత్తా చూపించగలదని అర్థమవుతుంది. రకుల్ గ్లామర్ ను సినిమాలో సరిగా వాడుకోలేదు. ఆమె గ్లామరస్ గా కనిపించిన ఒక్క పాటను సినిమాలోంచి తీసేశారు. ఎక్కడో ఎండ్ టైటిల్స్ పడేప్పుడు వాడుకున్నారు కానీ ఫలితం లేకపోయింది.

విలన్ రవికిషన్ గెటప్ బాగుంది, అతడి నటనా ఓకే కానీ.. అతడి క్యారెక్టర్ లో బలం లేకపోవడం వల్ల అవసరానికి మించి ‘అతి’గా నటించిన ఫీలింగ్ కలుగుతుంది. ‘జిల్’ ఫేమ్ కబీర్ ఖాన్ కూడా తన ప్రత్యేకత చూపించడానికి ఏమీ లేకపోయింది. గ్రామ పెద్దగా, తాగుబోతుగా చేసిన బాలీవుడ్ నటుల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వాళ్లతో తెలుగే మాట్లాడించినపుడు.. తెలుగువాళ్లనే పెట్టుకుంటే పోయేది. ఆ పాత్రలు వాళ్లు చేయడం వల్ల వచ్చిన లాభమేమీ లేదు. తనికెళ్ల భరణి బాగానే చేశాడు కానీ.. ఆయన పాత్రా అంతంతమాత్రమే. బ్రహ్మి ఎప్పట్లాగే హీరోతో బాదించుకునే పాత్రలో ఓ మోస్తరుగా నవ్వించాడు. పోసాని, ఆశిష్ విద్యార్థిలవి చెప్పుకోదగ్గ పాత్రలేమీ కావు.

సాంకేతికవర్గం:

కిక్ సినిమాతో వేసినంత బలమైన ముద్ర కిక్-2లో వేయలేకపోయాడు తమన్. కిక్ సినిమాకు సంబంధించి గోరే గోరే లాంటి పాటలు ఇప్పటికీ వెంటాడుతాయి. అందులో హీరో క్యారెక్టరైజేషన్ కు వాడిన ట్రేడ్ మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర్ ను కూడా ఇప్పటికీ మరిచిపోలేం. కానీ ఇందులో అలాంటి ప్రత్యేకత ఏమీ చూపలేకపోయాడు తమన్. పాటల్లో జెండాపై కపిరాజు, టైటిల్ సాంగ్ పర్వాలేదు. మిగతావేవీ రిజిస్టర్ కావు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా సాగుతుంది. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాల్లో ఒకటి. సినిమాలోని భారీతనాన్ని, క్వాలిటీని మనోజ్ కెమెరా బాగా క్యారీ చేసింది.

కళ్యాణ్ రామ్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు కానీ.. చాలా చోట్ల ఖర్చు వృథా అయింది. భారీగా సెట్లు వేశారు కానీ.. చాలావరకు అనవసరమే. విలేజ్ సెట్ సహజంగా లేదు. గ్రామానికి సంబంధించిన సన్నివేశాలు ఎంత కృతకంగా ఉన్నాయో.. సెట్టింగ్స్ కూడా అలాంటి ఫీలింగే తెప్పిస్తాయి. ఎడిటింగ్ లో చాలా పెద్ద తప్పిదాలు జరిగాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో గంట కథనాన్ని పావుగంటకు తగ్గించి ఉంటే సినిమా మరో రకమైన అనుభూతిని మిగిల్చేది. వక్కంతం వంశీ కథ ఔట్ లైన్ బాగానే అనిపించొచ్చు కానీ.. దాన్ని చిత్రానువాదం చేసిన తీరు ఏమాత్రం బాగాలేదు. స్క్రీన్ ప్లే సినిమాలో అతిపెద్ద మైనస్. సురేందర్ రెడ్డి సినిమాలన్నింట్లో ఇదే బ్యాడ్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. ద్వితీయార్ధంలో 50 నిమిషాల కథనం అతడి సామర్థ్యంపై చాలా సందేహాలు రేకెత్తిస్తుంది. ఇంతగా కనెక్టవని సన్నివేశాలు సురేందర్ కెరీర్ లో ఎప్పుడూ లేవు. ఐతే హీరోయిజం ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాల వరకు అతడి షార్ప్ నెస్ కనిపించింది.

చివరగా: ఇది డబుల్ 'కిక్' కాదు.. సగం 'కిక్'.

Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre