Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కిరాక్ పార్టీ

By:  Tupaki Desk   |   16 March 2018 1:36 PM GMT
మూవీ రివ్యూ : కిరాక్ పార్టీ
X
‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ

నటీనటులు: నిఖిల్-సిమ్రాన్ పరీంజా-సంయుక్త హెగ్డే-రాకేందు మౌళి-బ్రహ్మాజీ-సిజ్జు-హేమంత్-షాయాజి షిండే తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ: రిషబ్ శెట్టి
స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ
మాటలు: చందూ మొండేటి
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

‘స్వామి రారా’ దగ్గర్నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని విభిన్నమైన సినిమాలతో సాగిపోతున్నాడు నిఖిల్. ఇప్పుడతను కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ‘కిరాక్ పార్టీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నిఖిల్ మిత్రులు చందూ మొండేటి.. సుధీర్ వర్మ రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ‘హ్యాపీడేస్’ తరహా యూత్ ఫుల్ కాలేజ్ స్టోరీలా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: కృష్ణ (నిఖిల్) ఇంజినీరింగ్ తొలి సంవత్సరంలో చేరిన కుర్రాడు. స్నేహితులతో కలిసి సరదాగా కాలేజీ జీవితాన్ని గడిపేస్తుంటాడతను. అతను తన సీనియర్ అయిన మీరా (సిమ్రాన్ పరీంజా)ను ఇష్టపడతాడు. ముందు అతడిని దూరం పెట్టినప్పటికీ మీరా కూడా ఆ తర్వాత అతడికి చేరువవుతుంది. అతడిని ప్రేమించే స్థితికి చేరుతుంది. అలాంటి సమయంలో ఒక అనూహ్య ఘటన జరుగుతుంది. అదేంటి.. దాని వల్ల కృష్ణ జీవితం ఎలా మలుపు తిరిగింది.. అతడి మిగతా కాలేజ్ లైఫ్ ఎలా సాగింది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: సినిమాలకు మహరాజ పోషకులంటే యువ ప్రేక్షకులే. వాళ్లను అమితంగా ఆకర్షించే సినిమాలు కాలేజ్ నేపథ్యంలో సాగేవే. ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలు క్లిక్ అయితే వాటి రేంజే వేరుగా ఉంటుంది. ఆ కోవలో తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘హ్యాపీడేస్’. తెలుగులో అదొక కల్ట్ క్లాసిక్ లాగా నిలిచిపోయింది. దశాబ్దం కిందట వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత కాలేజ్ నేపథ్యంలో సాగే ఎన్నో కథలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ప్రతి సినిమాకూ దాంతో పోలిక రావడం కూడా సహజం. ‘కిరాక్ పార్టీ’ కూడా ‘హ్యాపీ డేస్’ను గుర్తుకు తెస్తుంది. ఇంకా ‘ప్రేమమ్’తోనూ దీనికి పోలికలు కనిపిస్తాయి.

కళాశాల జీవితాన్ని దాటి వచ్చిన వాళ్లకు నోస్టాల్జిక్ అనిపించే మంచి మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. కొన్ని చోట్ల నవ్వించి.. కొన్నిచోట్ల మనసును భారంగా మార్చి.. కొన్ని చోట్ల మంచి ఫీల్ తీసుకొస్తుంది ‘కిరాక్ పార్టీ’. కాకపోతే ఇంతేనా.. ఇంకా ఏదో కావాలనిపించే భావనను ఇది ఆద్యంతం రేకెత్తిస్తూనే ఉంటుంది. చివరికి సినిమా ముగిశాక కూడా అదే భావన కలుగుతుంది. అందులోనూ కన్నడ నుంచి ఏరి కోరి ఈ కథను తీసుకొచ్చి.. చందూ మొండేటి.. సుధీర్ వర్మ లాంటి వాళ్ల సహకారంతో తీర్చిదిద్దారంటే ఇది మరింత ప్రత్యేకంగా ఉండాల్సిందనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే.. కొంచెం నవ్వించి.. కొంచెం కదిలించి... అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టించి.. ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది ‘కిరాక్ పార్టీ’.

ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఫ్రెషర్స్ డే నుంచి.. నాలుగో ఏడాది ఫేర్వెల్ డే వరకు ఒక కుర్రాడి జీవితాన్ని చూపించే సినిమా ‘కిరాక్ పార్టీ’. పూర్తిగా కళాశాల నేపథ్యంలోనే సాగుతుందీ చిత్రం. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం.. క్లాస్ క్లాసంతా కాలేజ్ బంక్ కొట్టి సినిమా చూడటం.. స్టూడెంట్స్ మధ్య గొడవలు.. ప్రిన్సిపాల్ దగ్గర పంచాయితీలు.. కాలేజ్ బ్యూటీ వెంట అబ్బాయిలందరూ మూకుమ్మడిగా పడటం.. అందరిలోంచి హీరో ఆమెను ఇంప్రెస్ చేయడం.. వీళ్ల మధ్య రొమాంటిక్ ట్రాక్.. ఇలా ఒక కాలేజ్ కథ నుంచి ఆశించే అంశాలే ‘కిరాక్ పార్టీ’లో కనిపిస్తాయి. ఇందులోని మూమెంట్స్ కొత్తగా అనిపించవు కానీ.. ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తూ సాగుతాయి. తొలి గంట అలా అలా టైంపాస్ చేయిస్తూ నడిచిపోతుంది.

ఇంటర్వెల్ దగ్గర మలుపుతో సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఒక్కసారిగా ప్రేక్షకులు సీరియస్ మూడ్లోకి వెళ్లిపోతారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని డీల్ చేసిన తీరు చూసి ద్వితీయార్ధం ఇంటెన్స్ గా.. సీరియస్ గా సాగుతుందని అనుకుంటాం కానీ.. అలా ఏమీ ఉండదు. కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్లీ ప్రథమార్ధం తరహాలోనే సరదాగా నడిపించడానికే ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాలు వినోదాన్ని పంచినా.. కథ మాత్రం ఒక దశా దిశా లేకుండా సాగుతున్నట్లు అనిపిస్తుంది. వ్యవహారం పూర్తిగా ట్రాక్ తప్పుతోందనగా.. చివరి 20 నిమిషాల్లో మళ్లీ ‘కిరాక్ పార్టీ’ గాడిన పడుతుంది. హీరో పాత్రతో పాటు కథను కూడా కొంచెం ట్రాక్ లో పెట్టే ప్రయత్నం జరుగుతుంది చివర్లో. ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఎమోషన్ తీసుకొస్తుంది. కాలేజ్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వాళ్లలో ఫీల్ తీసుకొస్తాయి.

నిడివి ఎక్కువ కావడం.. మధ్యలో కథనం దారి తప్పడం.. అనాసక్తికరమైన కొన్ని సన్నివేశాలు ‘కిరాక్ పార్టీ’ గ్రాఫ్ ను తగ్గిస్తాయి. ‘కిరిక్ పార్టీ’ కన్నడ ప్రేక్షకులకు కొత్తగా ఉండి ఉండొచ్చేమో కానీ.. మనం ఇప్పటికే ఇలాంటి సినిమాలు చూశాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు. సినిమా మొత్తం కాలేజీ నేపథ్యంలోనే సాగడం వల్ల స్టూడెంట్స్ దీనికి రిలేట్ అవుతారు. టార్గెటెడ్ ఆడియన్స్ కు రీచ్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి. వాళ్లతో చల్తా హై అనిపించేస్తుంది ఈ చిత్రం. ఐతే ఈ సినిమాకు కుదిరిన కాంబినేషన్ మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే మాత్రం ‘కిరాక్ పార్టీ’ మరింత మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది.

నటీనటులు: నిఖిల్ నటన సినిమాకు ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. నటుడిగా అతడిలోని పరిణతిని ఈ సినిమాలో చూడొచ్చు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను అతను సమర్థవంతంగా పోషించాడు. కాలేజీలో మొదటి సంవత్సరం చేరిపుడు ఉండే అల్లరి.. అత్యుత్సాహం.. తెలియనితనాన్ని చక్కగా చూపించాడు. అలాగే ఏళ్లు గడిచాక వచ్చే మార్పులకు తగ్గట్లు పరిణతితోనూ నటించాడు. తనలో తాను సంఘర్షణకు గురయ్యే పతాక సన్నివేశాల్లో నిఖిల్ చాలా బాగా చేశాడు. మెయిన్ హీరోయిన్ సిమ్రన్ పరీంజా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె అందంగా ఉంది కానీ.. నటన పరంగా ఏమంత ఆకట్టుకోదు. సంయుక్త హెగ్డే కూడా అంతే. హీరో స్నేహితులుగా రాకేందు మౌళి.. హేమంత్ తదితరులు బాగా చేశారు. బ్రహ్మాజీ.. సిజ్జు.. షాయాజీ షిండే వీళ్లంతా పాత్రలకు తగ్గట్లు చేశారు.

సాంకేతికవర్గం: ఒరిజినల్ ‘కిరిక్ పార్టీ’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథే దీనికీ సంగతాన్నందించాడు. పాటలు బావున్నాయి. గురువారం సాయంకాలం పాట వెంటాడుతుంది. మిగతా పాటలూ ఓకే. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం మాత్రం సోసోగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఒరిజినల్ కథను పెద్దగా మార్చలేదు. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే.. చందూ మొండేటి మాటలు కథాంశానికి తగ్గట్లుగా ఉన్నాయి. కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కొన్ని చోట్ల పనితనం చూపించాడు. ఐతే మన నేటివిటీకి తగ్గట్లుగా సినిమాను మలచలేకపోయాడు. అతను సినిమాను మరింత క్రిస్ప్ గా మార్చే ప్రయత్నం చేయాల్సింది.

కిరాక్ పార్టీ.. క్యాంపస్ లో టైంపాస్!

రేటింగ్- 2.75/5