Begin typing your search above and press return to search.

మా అన్నయ్య పడిన కష్టానికి ప్రతిఫలమే 'సెబాస్టియన్'

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:30 AM GMT
మా అన్నయ్య పడిన కష్టానికి ప్రతిఫలమే సెబాస్టియన్
X
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పరిచయమైన యువ కథానాయకులలో కిరణ్ అబ్బవరం ఒకరు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కిరణ్ అబ్బవరం చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎస్. ఆర్. కల్యాణ మంటపం' సినిమాతో సక్సెస్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం. ఆ తరువాత మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఆ సినిమాలలో 'సెబాస్టియన్ PC 524' ముందుగా రెడీ అయింది. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "నా కెరియర్ విషయంలో మా అన్నయ్య ఎంతో పట్టుదలతో ఉండేవాడు. 'సెబాస్టియన్' సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తే, ఎలాంటి పరిస్థితుల్లో నా సినిమా ఆగిపోకూడదని భావించాడు. అప్పటికి మా అన్నకి ఎంత శాలరీ వస్తుందని కూడా నేను అడగలేదు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు గానీ, డబ్బు తీసుకొచ్చి పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఉన్నాడు. ఆ తరువాతనే చనిపోయాడు. తను పడిన కష్టం కోసమైనా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

నా దగ్గరికి వచ్చిన కథల్లో నాకు ఏది బాగా నచ్చితే అది చేసేస్తున్నాను. ఇంతవరకూ పెద్ద దర్శకుల నుంచి నాకు ఎలాంటి అవకాశం రాలేదు. కొంతమంది దర్శకుల దగ్గర మంచి కథలున్నాయని తెలిసినప్పుడు నేనే వెళ్లి వాళ్లను అడుగుతున్నాను కూడా. కాంబినేషన్స్ గురించి నేను ఆలోచించడం లేదు. కథ బాగుంటే చాలు అనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాను. అలా నా సినిమాల ద్వారా కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.

'సెబాస్టియన్' అనే కథను నేను ఒక 15 నిమిషాలు మాత్రమే విన్నాను. ఈ కథను వినగానే ఓకే చెప్పేశాను. ఇది ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా స్కోప్ ఉన్న సబ్జెక్ట్. నిర్మాతలు కూడా ఈ కథపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందువలన తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా రోజుల పాటు చాలామందికి గుర్తుండి పోతుంది. రేచీకటి ఉన్న ఓ పాత్రలో 'చంటి'లో బ్రహ్మానందం ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అలాంటి రేచీకటి ఉన్న ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్ రోల్. ఆడియన్స్ కి కావలసిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో దొరుకుతుంది" అని చెప్పుకొచ్చాడు.