Begin typing your search above and press return to search.

బ్యాగ్రౌండ్ ఏంటి? ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? అని ప్రశ్నించే వారికి ఇదే నా జవాబు: కిరణ్

By:  Tupaki Desk   |   18 July 2022 11:02 AM GMT
బ్యాగ్రౌండ్ ఏంటి? ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? అని ప్రశ్నించే వారికి ఇదే నా జవాబు: కిరణ్
X
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో కిరణ్.. తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అర డజను చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ట్విటర్ వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసాడు. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ.. కష్టపడి పనిచేయడం వల్లనే తనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని అన్నాడు. తనపై నెగెటివిటీ వస్తోందంటే జీవితంలో ఏదో పాజిటివ్ గా సాధించానని అర్థమని పేర్కొన్నాడు.

''నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి దశలో మీరు నాపై కురిపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞుడను. అది షార్ట్ ఫిల్మ్ కావచ్చు.. ఫీచర్ ఫిల్మ్‌లు కావచ్చు.. నేను ఇప్పుడు ఒక ప్రేక్షకుడిగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యానర్‌లలో నా రాబోయే ప్రాజెక్ట్స్ కావచ్చు. నా ఎదుగుదలకు మీ సపోర్ట్ మాత్రమే ఇంధనం. దానికి థ్యాంక్స్ మాత్రమే సరిపోదు''.

''ప్రతి సినిమాతో మరింత మెరుగ్గా పని చేస్తానని.. మిమ్మల్ని అలరించేందుకు నా బెస్ట్‌ ని అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి? బ్యాగ్రౌండ్ ఏంటి? గట్టి సపోర్ట్ ఉందేమో?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే 'హార్డ్ వర్క్''.

''క్లాస్ లో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కనోడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగెటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగెటివిటీ నాపై వస్తోంది అంటే జీవితంలో నేనేదో పాజిటివ్ గా సాధించానని అర్థం''.

''ఈ పని కోసమే చాలా ఏళ్లు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా. ఈ ప్రాసెస్ లో నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీమ్ మెంబర్స్ మరియు ఆడియన్స్ అందరికి చాలా థాంక్స్'' అని కిరణ్ అబ్బవరం తన నోట్ లో రాసుకొచ్చాడు.

కాగా, 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరవాత చేసిన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో వరుస ప్రాజెక్టలలో అవకాశాలు వచ్చాయి.

ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో.. ప్రస్తుతం కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మిస్తోన్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే చిత్రంలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ చేస్తున్నాడు.

అలానే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో 'మీటర్' సినిమాతోపాటు ఏఎంరత్నం సమర్పణలో 'రూల్స్ రంజన్' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది కిరణ్ అబ్బావరం ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.