Begin typing your search above and press return to search.

‘కబాలి’ని అలా వాడేసుకుంటున్న గవర్నర్

By:  Tupaki Desk   |   4 July 2016 7:59 AM GMT
‘కబాలి’ని అలా వాడేసుకుంటున్న గవర్నర్
X
దేశంలో తొలి ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. తన పదవీ కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలకు తెరతీశారామె. ఈ మధ్యే రాజకీయ రంగప్రవేశం చేసి.. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కిరణ్ బేడికి మోడీ సర్కారు ఇటీవలే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ పదవిలోకి వచ్చీ రాగానే తనదైన శైలిలో వినూత్నమైన నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది కిరణ్ బేడి. పుదుచ్చేరిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడం కోసం ఆమె ‘కబాలి’ సినిమాను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఊరికే ప్రచారం చేసి వదిలేయకుండా నిజంగానే ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టేస్తోంది కిరణ్ బేడి.

ఎవరైతే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకుంటారో వారికి కబాలి సినిమా టికెట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పుదుచ్చేరిలోని సెల్లిపేట్ అనే గ్రామానికి ఈ ఆఫర్ ను ప్రకటించింది ప్రభుత్వం. ఈ గ్రామంలో సగానికి సగం ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అందుకే ‘కబాలి’ సినిమా ద్వారా వీరిలో చైతన్యం తేవడానికి కిరణ్ బేడి ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడం ద్వారా ఆయన మనసు గెలవడానికి కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎందుకోసం చేసినా ఇది మంచి పనే కావడంతో ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ‘కబాలి’ టికెట్ల కోసం ఎంతమంది టాయిలెట్లు కట్టిస్తారో చూడాలి.