Begin typing your search above and press return to search.

సొంత బ్యానర్లో కీర్తి సురేశ్ .. తనకి చాలా స్పెషల్ అట!

By:  Tupaki Desk   |   19 Nov 2021 3:43 AM GMT
సొంత బ్యానర్లో కీర్తి సురేశ్ .. తనకి చాలా స్పెషల్ అట!
X
కీర్తి సురేశ్ .. చూడటానికి ముద్దబంతి పువ్వులా ముద్దుగా .. ముచ్చటగా ఉంటుంది. అమరశిల్పి జక్కన 'ఉలి'కి అందని అందంలా ఉంటుంది. చక్కెరలో ముంచిన చక్కదనంలా .. చందమామలా అనిపిస్తుంది. అందువల్లనే తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆమె అంటే కుర్రాళ్లకు విపరీతమైన అభిమానం .. అపారమైన ఆరాధన. కీర్తి సురేశ్ తెలుగు తెరకి 'నేను శైలజ' సినిమాతో పరిచయమైంది. తెరపై ఈ అమ్మాయిని చూసిన వాళ్లంతా 'కొత్త పిల్ల భలేగా చేసిందే' అనుకున్నారు. తెరలుగులో కీర్తికి అది ఫస్టు సినిమా కావొచ్చు .. కానీ తాను మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అమ్మాయి.

కీర్తి సురేశ్ తండ్రి అక్కడ ప్రముఖ నిర్మాత .. ఆమె తల్లి మేనక అలనాటి హీరోయిన్. అందువలన బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఒక కుటుంబం నుంచి కీర్తి వచ్చింది. 80 - 90 దశకాల్లో ఆమె తండ్రి 'రేవతి కళామందిర్' అనే బ్యానర్ పై నిర్మాతగా అనేక సినిమాలను నిర్మించాడు. సొంత బ్యానర్లో కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత ఇతర బ్యానర్లలోను బాలనటిగా సినిమాలు చేసింది. మళ్లీ ఇంతకాలానికి ఆమె తన సొంత బ్యానర్లో .. హీరోయిన్ గా తొలిసారిగా 'వాషి' అనే సినిమా చేయడానికి రెడీ అవుతోంది.

సొంత బ్యానర్లో సినిమా చేయడానికి తన తండ్రికి కీర్తి సురేశ్ డేట్లు కేటాయించడం గర్వించే విషయం. ఈ సినిమాలో కథానాయకుడిగా టోవినో థామస్ నటించనున్నాడు. విష్ణు రాఘవ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సొంత బ్యానర్లో కథానాయికగా చేస్తున్న ఈ సినిమా తనకి చాలా స్పెషల్ అని కీర్తి సురేశ్ చెబుతోందట. ప్రస్తుతం ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాలతో బిజీగానే ఉంది. ఆర్ధికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన కారణంగా అవకాశాల విషయంలో ఆమె తొందరపడటం లేదు.

ప్రస్తుతం తెలుగు మహేశ్ బాబు సరసన నాయికగా 'సర్కారువారి పాట' చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మలయాళంలో 'మరక్కార్' .. తమిళంలో 'సానికాయిధం' సినిమాను పూర్తి చేసింది. తాను హీరోయిన్ గా చేయడానికి అవకాశం లేని రజనీ .. చిరంజీవివంటి సీనియర్ స్టార్ హీరోలకి చెల్లెలిగా నటించడానికి ఆమె ఉత్సాహాన్ని చూపుతోంది. 'పెద్దన్న'లో రజనీ చెల్లెలిగా మెప్పించిన ఆమె , చిరంజీవి 'భోళా శంకర్'లోను చెల్లెలి పాత్రను పోషిస్తోంది. ఇక తెలుగులో కొన్ని పెద్ద బ్యానర్లు తమ సినిమాల కోసం ఆమె పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.