Begin typing your search above and press return to search.

ఆ కథ బాలయ్యకు నాకు ఇద్దరికి నచ్చలేదు

By:  Tupaki Desk   |   18 Dec 2019 8:30 PM GMT
ఆ కథ బాలయ్యకు నాకు ఇద్దరికి నచ్చలేదు
X
టాలీవుడ్‌ లో అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఉన్న దర్శకుడు ఎవరు అంటే ఇప్పుడు రాజమౌళి అని చెప్తారు. కాని 1980 మరియు 1990లలో మాత్రం ఎ. కోదండరామిరెడ్డి అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఉన్న దర్శకుడిగా రికార్డు దక్కించుకున్నాడు. 90కి పైగా సినిమాలు చేసిన దర్శకుడు కోదండరామిరెడ్డి ఇటీవల ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో జాలీగా అనే టాక్‌ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా కోదండరామి రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.

ఈ సందర్బంగా ఆయన బాలకృష్ణతో చేసిన 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ గా నిలిచింది. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ఆ సినిమా చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో పిలిపించి ఈ కథ చెప్పించారని.. అప్పుడు పక్కనే పరుచూరి బ్రదర్స్‌ కూడా ఉన్నారు. కథ విన్న తర్వాత నేను నచ్చలేదండీ అన్నాను. అప్పుడు సరే నచ్చకుంటే చేయవద్దు అన్నారు. బయటకు వచ్చాక పరుచూరి బ్రదర్స్‌ ఎన్టీఆర్‌ వంటి గొప్ప వారు కథ చెప్తే అలా నచ్చలేదంటూ చెప్పేస్తావా అంటూ కోపగించుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత మళ్లీ సీఎం ఎన్టీఆర్‌ గారి నుండి ఫోన్‌ అంటూ ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. ఫోన్‌ లో ఎన్టీఆర్‌ గారితో మాట్లాడగా ఆ కథ నాకు నచ్చింది చేద్దామన్నారు. సరే పెద్దాయన కాదనలేం అని చేశాం. ఆ కథ విన్న బాలకృష్ణ గారు కూడా నచ్చలేదు అన్నారు. కాని ఆయన కూడా ఎన్టీఆర్‌ గారి మాట తీసి పారేయలేక సరే అన్నారు. ఆ సినిమా షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఒక షాట్‌ కు రీ షూట్‌ కు వెళ్దాం అంటే ఫ్లాప్‌ అయ్యే మూవీకి రీ టేక్‌ ఎందుకు లేండీ అంటూ బాలకృష్ణ గారు షాట్‌ ఓకే చేయించారంటూ కోదండరామిరెడ్డి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ మరియు కోదండరామిరెడ్డి అనుకున్నట్లుగానే తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా నిరాశ పర్చింది.