Begin typing your search above and press return to search.

కొడుకుని చిరంజీవిని చేయలేకపోయాడేం?

By:  Tupaki Desk   |   4 Aug 2015 10:11 AM GMT
కొడుకుని చిరంజీవిని చేయలేకపోయాడేం?
X
టాలీవుడ్‌ గర్వించదగ్గ దర్శకుల్లో సీనియర్‌ దర్శకులు కోదండరామిరెడ్డి ఒకరు. ఇన్నేళ్ల కెరీర్‌ లో ఆయన 93 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి హీరో గా 27 సినిమాలు తెరకెక్కించారు. చిరు మెగాస్టార్‌ గా ఎదగకముందు పిల్లర్స్‌ ని వేసింది ఆయనే అంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో కోదండరామిరెడ్డి దర్శకత్వానికి కామా పెట్టి కొడుకు వైభవ్‌ ని హీరోగా ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నారు. వైభవ్‌ తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి అక్కడ బాగానే రాణిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. పాండవుల్లో ఒకడు అనే చిత్రంతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వైభవ్‌.

వైభవ్‌ సినిమా సక్సెస్‌ మీట్‌ లో కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్‌ ఒకే అంటే నా 100వ సినిమా హీరో ఆయనే. ఈ విషయమై తనని కలవాల్సి ఉందింకా. చిరుతో అన్ని సినిమాలకు పనిచేయడం ఆనందంగా ఉంది. మరో ఏడు సినిమాలకు దర్శకత్వం వహిస్తే శతచిత్ర దర్శకుడిగా గుర్తింపు దక్కుతుందని కోదండరామిరెడ్డి తెలిపారు. అంత అనుభవం ఉన్న దర్శకుడు అయ్యి ఉండీ.. చిరంజీవిని దగ్గరగా పరిశీలించినవాడిగా అయ్యి ఉండీ.. కొడుకు వైభవ్‌ ని చిరంజీవి అంతటివాడిని చేయలేకపోవడానికి కారణమేంటో రెడ్డి గారు చెప్పనేలేదు.