Begin typing your search above and press return to search.

‘ఎన్జీకే’ పై అరవోళ్ల అతి

By:  Tupaki Desk   |   9 Jun 2019 5:30 PM GMT
‘ఎన్జీకే’ పై అరవోళ్ల అతి
X
గత వారం మంచి అంచనాల మధ్య విడుదలైన సూర్య సినిమా ‘ఎన్జీకే’కు అటు తమిళంలో, ఇటు తెలుగులో బ్యాడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో సూర్యకు ఇంకా మంచి ఫాలోయిింగ్ ఉండటం వల్ల ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది. తెలుగులో మాత్రం తొలి షోతోనే దీని ఫలితం తేలిపోయింది. ఏ దశలోనూ పుంజుకోని ‘ఎన్జీకే’ డిజాస్టరే అయింది. సూర్య తెలుగులో తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకున్నాక అతి తక్కువ వసూళ్లు వచ్చింది ఈ చిత్రానికే. ఐతే తమిళంలో మాత్రం ఈ సినిమా భలే ఆడేస్తున్నట్లుగా చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు కూడా పోస్టర్లు పడిపోయాయి. ఇటు దర్శకుడు సెల్వ రాఘవన్ - అటు హీరో సూర్య.. హిడెన్ డీటైల్స్ - సీక్రెట్స్ అర్థం చేసుకుని సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

తమిళ ప్రేక్షకుల్లో ఒక వర్గం.. ఈ సినిమాను అర్థం చేసుకోని ప్రేక్షకుల్ని తిట్టి పోస్తోంది. గతంలో సెల్వరాఘవన్ తీసిన ‘పుదుపేట్టై’ సహా కొన్ని సినిమాలు మొదట్లో ప్రేక్షకులకు రుచించలేదు. కానీ తర్వాత అవి క్లాసిక్ - కల్ట్ స్టేటస్ సంపాదించాయి. ‘ఎన్జీకే’ కూడా వాటి కోవలోకి చేర్చదగ్గ సినిమాగా చెబుతున్నారు. ముందు సినిమాను అర్థం చేసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. సినిమాలోని హిడెన్ డీటైల్స్ - సీక్రెట్ల గురించి వీడియోలు చేసి పెడుతున్నారు. సెల్వ ప్రతి సన్నివేశంలోనూ నిగూఢంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాడని.. దాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోకుండా సినిమాను తిడుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు సూర్య క్లైమాక్స్‌ కు ముందు ఇంటి నుంచి బయల్దేరుతూ తనను చివరిసారిగా చూసుకోమని తల్లిదండ్రులతో అంటాడు. దాన్ని బట్టి సూర్య చనిపోతాడేమో అనుకుంటాం. కానీ తర్వాతి సీన్ వచ్చేసరికి హీరో తల్లిదండ్రులే చనిపోయి ఉంటారు. అంటే రాజకీయాల్లో ఎదగడం కోసం హీరోనే తల్లిదండ్రుల్ని చంపిస్తాడన్నమాట. ఇది ప్రేక్షకులకు అర్థం కాలేదని - సెల్వ బ్రిలియన్స్ అర్థం చేసుకోలేకపోయారని అంటోంది ఓ వర్గం. కానీ దాచి పెట్టినంత మాత్రాన ఇది గొప్ప సీన్ అయిపోతుందా? ఒకవేళ దీన్ని స్ట్రెయిట్‌ గా తీస్తే.. రాజకీయాల కోసం హీరో తల్లిదండ్రుల్ని చంపించడం ఎంత ఆడ్‌గా ఉంటుంది? సినిమాలో ఇలా విడిపించి విడిపించకుండా చెప్పిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ‘ఎన్జీకే’ ఏమీ గొప్ప సినిమా అయిపోదు. సెల్వ కెరీర్లో అత్యంత పేలవమైన సినిమాల్లో ఇది ఒకటిగా ఉంటుందనడంలో మరో మాట ఏమీ లేదు.