Begin typing your search above and press return to search.

ఆ హీరో ఈ సారి గ‌ట్టిగానే కొట్టేలా వున్నాడుగా!

By:  Tupaki Desk   |   15 Sep 2022 1:44 PM GMT
ఆ హీరో ఈ సారి గ‌ట్టిగానే కొట్టేలా వున్నాడుగా!
X
ఎవ‌రి కెరీర్ ఎప్పుడు ఎలా వుంటుందో.. ఎప్పుడు రైజింగ్ లోకి వ‌చ్చేస్తెందో ఎవ‌రూ చెప్ప‌లేరు. టైమ్ స్టార్ట‌యితే అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపులు చూసిన వారి క‌థ మారిపోతూ వుంటుంది.. ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచేలా చేస్తూ వుంటుంది. స‌రిగ్గా ఇప్ప‌డు కోలీవుడ్ క్రేజీ హీరో శింబు విష‌యంలో అదే జ‌రుగుతోందా? అంటూ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ వ‌ర్గాలు కూడా అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇక కెరీర్ ఇంతేనా అనే స్థాయికి వెళ్లిన హీరో శింబు.

ఇటీవ‌ల వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించిన సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మానాడు'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని క‌మ్ బ్యాక్ అయ్యాడు. దీంతో అత‌ని స‌పోర్ట‌ర్స్ అంతా నీ టైమ్ మ‌ళ్లీ స్టార్ట‌యిందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. తాజాగా శింబు న‌టించిన లేటెస్ట్ త‌మిళ మూవీ 'వెంధు తానింధాతు కాడు'. గౌత‌మ్ మీన‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. కొంత విరామం త‌రువాత ఈ ఇద్ద‌రు క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో ఈ మూవీపై త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచ‌నాలున్నాయి.

తెలుగులో ఈ మూవీని 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో స్ర‌వంతీ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఫైనాన్సియ‌ర్ ల‌తో గొడ‌వ‌ల కార‌ణంగా చాలా కాలంగా గౌత‌మ్ మీన‌న్ సినిమాలు ఆగ‌పోతూ వ‌చ్చాయి. విక్ర‌మ్ తో గౌత‌మ్ మీన‌న్ చేసిన సినిమా ఇప్ప‌టికీ రిలీజ్ కు నోచు కోలేదు. దీంతో శింబు మూవీ కూడా అలాగే అవుతుందా? అని అంతా కంగారు ప‌డ్డారు. కానీ ఎట్ట‌కేల‌కు అన్ని అడ్డంకుల్ని అధిగ‌మించి ఈ మూవీ సెప్టెంబ‌ర్ 15న త‌మిళంలో విడుద‌లైంది.

గ‌తంలో ఏ సినిమాలో చేయ‌ని విధంగా శింబు కాటి కాప‌రి నుంచి గ్యాండ్ స్ట‌ర్ గా వివిధ ద‌శ‌ల్లో త‌న‌ని తాను మార్చుకుంటూ న‌టించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గురువారం త‌మిళంలో విడుద‌లైన ఈ మూవీకి అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వినిపిస్తోంది.

హీరోగా శింబు, ద‌ర్శ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ అద్భుత‌మైన ప‌నితీరుని క‌న‌బ‌రిచార‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ట్విట్టర్ వేదిక‌గా ఈ మూవీ పోస్ట‌ర్ ని షేర్ చేస్తూ శింబు టైమ్ స్టార్ట్స్ అగైన్ అని క్యాప్ష‌న్ ఇవ్వ‌డం వైర‌ల్ గా మారింది.

ఇప్ప‌టికే ప‌లు త‌మిళ మీడియాలు ఈ మూవీకి బ్లాక్ బ‌స్ట‌ర్ రేటింగ్ ని అందించ‌డంతో తెలుగులోనూ ఈ మూవీ అదే స్థాయి రిజ‌ల్ట్ ని సొంతం చేసుకోవ‌డం ఖాయం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగులోనూ ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో ఎక్క‌డా ఈ మూవీకి నెగెటివ్ టాక్ వినిపించ‌డం లేదు. దీంతో ఇక్క‌డ కూడా ఈ సారి గ‌ట్టిగానే కొట్టేలా వున్నాడ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో శింబు టైమ్ మ‌ళ్లీ స్టార్ట్ అయిన‌ట్టే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.