Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్క్రీన్ పై కోలీవుడ్ డైరెక్టర్స్ హవా!

By:  Tupaki Desk   |   25 May 2022 11:30 PM GMT
టాలీవుడ్ స్క్రీన్ పై కోలీవుడ్ డైరెక్టర్స్ హవా!
X
తమిళ హీరోలు .. హీరోయిన్లు తెలుగులోను తమ జోరు చూపిస్తున్నారు. అలాగే చాలా కాలం క్రితం నుంచే తమిళ దర్శకులు తెలుగులోను తమ పేరును గొప్పగా చెప్పుకునేలా చేశారు. తమిళంలో తిరుగులేని దర్శకుడు అనిపించుకున్న బాలచందర్ తెలుగులోను 'అంతులేని కథ' .. 'మరో చరిత్ర' .. 'రుద్రవీణ' సినిమాలను తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలు కూడా ఆణిముత్యాలు అనదగినవే .. జాతిరత్నాలుగా చెప్పదగినవే. ఇక భారతీరాజా .. భాగ్యరాజా కూడా తమదైన ముద్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.

ఇక కేఎస్ రవికుమార్ .. ఎస్.ఎ.చంద్రశేఖర్ .. విసు .. పి.వాసు తెలుగులోను గుర్తుపెట్టుకోదగిన సినిమాలు చేశారు. ఒకానొక సమయంలో తెలుగులో విసు చేసిన సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి. 'ఆడదే ఆధారం' .. 'సంసారం ఒక చదరంగం' సినిమాలు మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టాయి.

ఈ సినిమాలు టీవీల్లో వస్తే ఇప్పటికీ ప్రేక్షకులు వదిలిపెట్టరు. ఇక మణిరత్నంను తెలుగు దర్శకుడిగానే ఇక్కడి ప్రేక్షకులు భావిస్తారు. ఆయన నేరుగా తెలుగులో చేసిన 'గీతాంజలి' .. ప్రేమకథా చిత్రాల్లో ముందువరుసలో కనిపిస్తుంది.

తమిళ .. తెలుగు భాషల్లో డాన్స్ మాస్టర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా .. లారెన్స్ ఇద్దరూ కూడా దర్శకులుగా రాణించారు. ప్రభుదేవా ఇక్కడ చేసిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' .. లారెన్స్ చేసిన 'మాస్' సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక 'స్టాలిన్' .. 'స్పైడర్' సినిమాలతో మురుగదాస్ ఒక తరహా సినిమాలను తెరకెక్కిస్తే, '7G బృందావన కాలనీ' .. 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలతో సెల్వ రాఘవన్ తన మార్కు చూపించారు. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ దర్శకులు ఆకట్టుకున్నారు.

ఇక 'ఏ మాయ చేశావే' సినిమాతో గౌతమ్ మీనన్ .. 'ఇంద్రుడు చంద్రుడు'తో సురేశ్ కృష్ణ .. 'శౌర్యం' సినిమాతో శివ ఇక్కడ నిరూపించుకోగా, మరి కొంతమంది తమిళ దర్శకులు తెలుగు బాటపడుతున్నారు. రామ్ తో లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందిస్తుండగా, చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి
హరి రంగంలోకి దిగగా .. నాగచైతన్యతో సినిమా చేయడానికి వెంకట్ ప్రభు సిద్ధమవుతున్నాడు. తమిళ దర్శకులు ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమాలు చేసి .. ఆ సినిమాలను తమిళంలో కూడా విడుదలయ్యేలా చూసుకోవడం ఇప్పటి ట్రెండ్ గా మారిపోయింది.