Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: అవ‌స‌రం టాలీవుడ్ వైపు న‌డిపిస్తోందా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 8:31 AM GMT
టాప్ స్టోరి: అవ‌స‌రం టాలీవుడ్ వైపు న‌డిపిస్తోందా?
X
తెలుగు స్టార్ హీరోల్ని త‌మిళ ప‌రిశ్ర‌మ ఆద‌రించ‌దు. కానీ కోలీవుడ్ హీరోల్ని మాత్రం తెలుగు ప్రేక్ష‌కులు తిర‌స్కరించ‌కుండా నెత్తిన పెట్టుకుంటారన్న‌ది అంద‌రికీ తెలిసిందే. భాషా బేధం కార‌ణంగానే త‌మిళులు తెలుగు వాళ్లంటే చిన్న చూపు చూస్తార‌నే కామెంట్ చాలా కాలంగానే వినిపిస్తున్నా అవేవీ ఇక్క‌డ పట్టించుకోరు. మ‌ద్రాసు నుంచి విడిపోయిన ద‌గ్గ‌ర నుంచి తెలుగు వాళ్ల ప‌రిస్థితి అదే. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగు వాళ్ల ప‌ట్ల త‌మిళులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది `ట్రైన్` అనే సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో చెప్ప‌క‌నే చెప్పారు. కానీ తెలుగు వారు మాత్రం అలాంటి వివ‌క్ష ఏనాడూ చూపించ‌లేదు. క‌ళారంగాన్ని న‌టుల‌ను కించ‌ప‌ర‌చ‌ని మంచిత‌నం ఇక్క‌డివారికే చెల్లింది. పొరుగున ఉన్న సోద‌రుల‌ను త‌మ కుటుంబ స‌బ్యులాగే భావిస్తారు.

ఈ విష‌యాన్ని కార్తీ.. సూర్య లాంటి వారు కొన్నేళ్ల క్రిత‌మే చెప్పారు. ఇప్ప‌టికీ చెబుతూనూ ఉన్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌పై బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ చూపించే అభిమానం కూడా అలాగే ఉంటుంది. అలాగే సీనియ‌ర్లు అయిన క‌మ‌ల్ హాస‌న్.. ర‌జ‌నీకాంత్ తెలుగులో మార్కెట్ ని కొన్ని ద‌శాబ్ధాల క్రిత‌మే ఏర్ప‌రుచుకున్నారు. ఇంకా విక్ర‌మ్..అజిత్..విశాల్ సినిమాల‌కు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా విజ‌య్...ద‌నుష్ లు కూడా టాలీవుడ్ మార్కెట్ పై క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స్టార్ హీరోలంతా నేరుగా తెలుగు సినిమాలు చేయ‌డానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ధ‌నుష్ వ‌రుస‌గా నాలుగు తెలుగు చిత్రాల్ని లాక్ చేసిన‌ట్లు స‌మాచారం.

అందులో ఒక‌టి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. అలాగే మిగ‌తా మూడు చిత్రాల‌కు కూడా తెలుగు ద‌ర్శ‌కులే ప‌నిచేస్తున్నారు. ఇక విజ‌య్ త్వ‌ర‌లోనే వంశీ పైడిప‌ల్లితో త‌న చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నాడు. ఇంకా మ‌రికొన్ని క‌థ‌లు విని లైన్ లో పెట్టిన‌ట్లు స‌మాచారం. సూర్య- బోయ‌పాటి శ్రీనుతో వ‌చ్చే ఏడాది సినిమా ప్రారంభించ‌నున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇటీవ‌లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ ఇంత త్వ‌ర‌గా సెట్స్ కు వెళ్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇలా వ‌రుస‌గా కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు ప్రారంభించ‌డం వెనుక చాలా సంగ‌తులే ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తెలుగు సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. వ‌సూళ్ల ప‌రంగాను ఇక్క‌డ సినిమాలు వంద‌ల కోట్లు రాబ‌డుతున్నాయి. బ‌డ్జెట్ ప‌రంగానూ నిర్మాత‌లు ఆలోచించే ప‌రిస్థితి లేదు. స్టార్ హీరోతో సినిమా అంటే ఇప్పుడు 100 కోట్లు మినియం బ‌డ్జెట్ గా క‌నిపిస్తోంది. త‌మిళ్ లో ఆ స్కోప్ లేదు. అలాగే క‌రోనా రాక‌తో ప‌రిశ్ర‌మ తీవ్ర‌మైన సంక్షోభంలో ప‌డింది. నిర్మాత‌లు సినిమాలు నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం లేదు. అలాగే థియేట‌ర్ల ఎగ్జిబిట‌ర్ల సంఘాలన్ని కూడా ఒకే మాట మీద నిల‌బ‌డ‌తాయి. ఫ‌లానా హీరో సినిమా థియేట‌ర్లో వేయ‌కూడ‌దంటే రాష్ట్ర‌ వ్యాప్తంగా ఆ సినిమా రిలీజ్ ఆగిపోయిన‌ట్లే.

ఆ ర‌క‌మైన బెదిరింపులు అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం. థ‌ర్డ్ వేవ్ దెబ్బ‌తో థియేట‌ర్ వ్య‌వ‌స్థ పూర్తిగా అస్త‌వ్య‌స్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల‌తో ఎగ్జిబిష‌న్ వ్య‌వ‌స్థ మ‌రింత క‌నుమ‌రుగ‌వుతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలా ఇన్ని కార‌ణాల న‌డుమ కోలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లోనూ మార్కెట్ ని బిల్డ్ చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే అవ‌స‌రానికి మాత్ర‌మే కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు వైపు చూడ‌డ‌మే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంద‌ని ఒక సెక్ష‌న్ విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉన్నారు.