Begin typing your search above and press return to search.

దోచుకున్నా....కథ అందించారు

By:  Tupaki Desk   |   28 March 2015 6:58 AM GMT
దోచుకున్నా....కథ అందించారు
X
ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కోవాలి అనే వ్యాఖ్యల్ని సాధారణంగా మనం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, క్లాసుల్లోనే వింటుంటాం. దాన్ని ఇపుడు ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్తున్నారు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్. ఓ విందుకు హాజరైన సందర్భంగా దాదాపు రూ.3 లక్షలు దోపిడికి గురైన విషయాన్ని ఆ విధంగా స్వీకరించారు వెంకట్.

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ షాద్ నగర్ లోని ఆయన ఫాంహౌస్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారి కాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా. వీరి వెనుకనే తమ కార్లలో వస్తున్న శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దోపిడిపై కోన వెంకట్ స్పందిస్తూ... తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని అన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించారని, దొంగల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. అయితే... డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం ఇందులో అసలు ట్విస్ట్. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు, దాని కథాకమామిషు అంతా ఆయన తదుపరి చిత్రంలో ప్రేక్షకుల్ని అలరిస్తాయా? వేచి చూడాలి మరి.