Begin typing your search above and press return to search.

కొణిదెల ప్రమోషన్లపై ‘మెగా’ అసంతృప్తి

By:  Tupaki Desk   |   23 April 2022 3:30 AM GMT
కొణిదెల ప్రమోషన్లపై ‘మెగా’ అసంతృప్తి
X
టాలీవుడ్లో పీఆర్ బలం బాగా ఉన్న ఫ్యామిలీగా మెగా కుటుంబానికి పేరుంది. తెలుగులో ఉన్న పీఆర్వోల్లో మెజారిటీ మెగా కాంపౌండ్‌కు సన్నిహితులు. వాళ్లంతా మెగా అభిమానులు. దీంతో మెగా ఫ్యామిలీ హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా పబ్లిసిటీ మోతెక్కిపోతుంటుందనే పేరుంది. యాంటీ ఫ్యాన్స్ పీఆర్ విషయంలో 'మెగా మాఫియా' నడుస్తుంటుందని కౌంటర్లు కూడా వేస్తుంటారు.

కానీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తూ.. వారి సొంత బేనర్ 'కొణిదెల ప్రొడక్షన్స్'లో నిర్మితమైన 'ఆచార్య'కు ప్రమోషన్ల హడావుడే కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకుముందు చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించిన 'సైరా' సినిమా విషయంలోనూ ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు చేయలేదనే అసంతృప్తి స్వయంగా మెగా అభిమానుల్లోనే ఉంది. ఇప్పుడు 'ఆచార్య'కు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

మొన్న భలే భలే బంజారా పాట అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. టెక్నికల్ ఇబ్బందేదో తలెత్తింది. కనీసం దీని గురించి సోషల్ మీడియాలో క్లారిఫికేషన్, కమ్యూనికేషన్ కూడా లేదు. ఓపక్క యాంటీ ఫ్యాన్సేమో పీఆర్ విషయంలో మెగా మాఫియా అంటారు. ఇక్కడ చూస్తే పీఆర్ ఇంత పూర్ అంటూ మెగా అభిమానులే పంచులు వేశారు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాల యుఫోరియా తర్వాత ప్రేక్షకులు రిలాక్సేషన్ మోడ్‌లో ఉండగా.. వారిని 'ఆచార్య' వైపు మళ్లించడానికి పబ్లిసిటీ కొంచెం గట్టిగా చేయాల్సిన అవసరముంది. ఏదో రకంగా బజ్ పెంచకుంటే అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపుతుంది. చిరు సినిమా, పైగా చరణ్ కూడా ఉన్నాడు కాబట్టి హైప్‌దేముంది దానికదే వస్తుందిలే అన్న ధీమా ఉండొచ్చు కానీ.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే, ఘన విజయం సాధించాలంటే పీఆర్‌తో హైప్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటు కొణిదెల ప్రొడక్షన్స్ కానీ, అటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈ విషయంలో పెద్దగా స్పందిస్తున్నట్లుగా కనిపించడం లేదు.