Begin typing your search above and press return to search.

'కూత ర్యాంప్'.. క్రేజీ హుక్ స్టెప్ తో రచ్చ చేసిన కీరవాణి కొడుకు..!

By:  Tupaki Desk   |   17 Oct 2022 9:32 AM GMT
కూత ర్యాంప్.. క్రేజీ హుక్ స్టెప్ తో రచ్చ చేసిన కీరవాణి కొడుకు..!
X
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఇండస్ట్రీలో హీరోగా నిలదిక్కుకోడానికి బాగా కష్టపడుతున్నాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమైన సింహా.. 'తెల్లవారితే గురువారం' 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి చిత్రాలతో అలరించారు. ఇప్పుడు "భాగ్ సాలే" అనే ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్నాడు.

శ్రీ సింహా హీరోగా నూతన దర్శకుడు ప్రణీత్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం "భాగ్ సాలే". టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మేకర్స్.. తాజాగా 'కూత ర్యాంప్' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అయితే ఈ పాటలో ఉపయోగించిన లిరిక్స్ మరియు శ్రీ సింహా స్టెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

'పైకే క్లాస్ లోన ఊర మాసులే.. మామా ఎవడిదైనా మాట అస్సలు విననులే.. అయినా మనల్ని మించిన తోపు ఇక్కడ ఎవడులే' అంటూ సాగిన ఈ పాటకు శ్రీ సింహా సోదరుడు కాలభైరవ సంగీతం సమకూర్చడమే కాదు.. స్వయంగా ఆలపించారు.

శ్రీ సింహా ఓ బూతు పదాన్ని సౌండ్ బయటకు రాకుండా ఉచ్చరించడంతోనే ఈ పాట ప్రారంభమైంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యువతలో ట్రెండ్ గా మారిన 'కూత ర్యాంప్' వంటి ఊతపదాలతో నిండిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు.

ట్రెండ్ కు అనుగుణంగా యూత్ ను ఆకట్టుకునే లిరిక్స్ మాత్రమే కాదు.. భాను మాస్టర్ కంపోజ్ చేసిన క్రేజీ హుక్ స్టెప్ కూడా ఈ పాట తక్షణమే వైరల్ కావడానికి కారణమైంది. సక్సెస్ కోసం కీరవాణి తనయుడు ఈసారి కాస్త ట్రాక్ మార్చినట్లుగా 'కూత ర్యాంప్' సాంగ్ ని బట్టి అర్థమవుతోంది.

శ్రీ సింహా సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. జాన్ విజయ్ - రాజీవ్ కనకాల - వెన్నెల కిషోర్ - సత్య - నందినీరాయ్ - సుదర్శన్ - వంశీ నెక్కంటి - వర్షిణి - వైవా హర్ష - కిడ్ చక్రి - జయవాణి - బాష - యాదం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

బిగ్ బెన్ సినిమా మరియు సినీ వ్యాలీ మూవీస్ తో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో 'భాగ్ సాలే' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అర్జున్ దాస్యన్ - యష్ రంగినేని & సింగనమల కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య గిడుటూరి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.