Begin typing your search above and press return to search.

వినాయక్, సుకుమార్, పూరిల వల్ల కానిది..

By:  Tupaki Desk   |   9 Aug 2015 12:07 PM GMT
వినాయక్, సుకుమార్, పూరిల వల్ల కానిది..
X
తొలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చాలామంది డైరెక్టర్లు.. రెండో సినిమా దగ్గరికొచ్చేసరికి బోల్తా కొట్టేస్తుంటారు. ఈ విషయంలో స్టార్ డైరెక్టర్లు కూడా చాలామంది మినహాయింపు కాదు. ‘ఆది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన వి.వి.వినాయక్.. రెండో సినిమా ‘చెన్నకేశవరెడ్డి’తో ఫ్లాప్ కొట్టాడు. ‘ఆర్య’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన సుకుమార్ ‘జగడం’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. ‘బద్రి’తో అరంగేట్రం చేసిన పూరి జగన్నాథ్ రెండో ప్రయత్నంలో ‘బాచి’ లాంటి డిజాస్టర్ తీశాడు. ఇంకా చాలామంది స్టార్ డైరెక్టర్లు ద్వితీయ విఘ్నం ఎదుర్కొన్నవారే. తొలి సినిమా మీద మాగ్జిమం ఎఫర్ట్ పెట్టేసి.. రెండో సినిమా విషయంలో కొంచెం రిలాక్స్ అవడం వల్లో.. భారీ అంచనాల ఒత్తిడి వల్లో కానీ.. సెకండ్ మూవీతో బోల్తా కొట్టిన దర్శకులే చాలామంది.

ఐతే తొలి సినిమాకు మించి.. రెండో సినిమాతో హిట్టు కొట్టే దర్శకులు చాలా తక్కువమందే ఉంటారు. ఆ జాబితాలో కొరటాల శివ చేరిపోయాడు. ‘మిర్చి’ లాంటి కూల్ హిట్ తో అరంగేట్రం చేసిన ఈ రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’తో మరింత పెద్ద సక్సెస్ అందుకున్నాడు. తొలి సినిమా తాలూకు అంచనాలు చాలా ఉన్నా.. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా.. కొరటాల ఎక్కడా ఒత్తిడికి గురైనట్లు కనిపించలేదు. కథ విషయంలో బాగా టైం తీసుకోవడం.. స్క్రిప్టు పక్కాగా రెడీ అయ్యాక కానీ షూటింగ్ కు వెళ్లకపోవడం అతడికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. మహేష్ వరుసగా రెండు పెద్ద ఫ్లాపులు ఎదుర్కొన్న నేపథ్యంలో శివను ఏమాత్రం హడావుడి పెట్టలేదు. అతడికి ఫుల్ ఫ్రీడం ఇచ్చాడు. తొలి సినిమా కంటే కూడా రైటింగ్ లో కానీ, డైరెక్షన్లో కానీ కొరటాల మరింత ప్రతిభ చూపించాడు. ద్వితీయ విఘ్నం దాటడమే విశేషమైతే.. కొరటాల మరింత పెద్ద విజయాన్నందుకోవడం ఇంకా పెద్ద విశేషం.